Fact Check: వినాశకాలే.. విపరీత రాతలే!

29 Mar, 2024 05:18 IST|Sakshi

పనిగట్టుకుని రామోజీ దుష్ప్రచారం.. రాష్ట్రంలో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు 

యకహోమా టైర్స్‌ కంపెనీలో మహిళలకు ఉపాధి అంటూ ఈనాడులోనే కథనం  

ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ వంటి పెద్ద పరిశ్రమలు వచ్చినా రాయని రామోజీ 

అమరరాజా ఇక్కడే ఉన్నా వక్రపు రాతలు.. 

తప్పుడు రాతల పూనకంలో రామోజీ ఊగిపోతున్నారు. కరోనా సమయంలో దేశమంతా విపత్కర స్థితిలో ఉంటే, ఆ సమయంలోనూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా  ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వచ్చాయి. ఈ సంగతి రామోజీకి తెలుసో లేదో మరి. తెలిసినా నిజాలు రాస్తే ఆయన రామోజీ ఎందుకవుతారు? నిజాలు చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలవుతుందనే శాపముందని దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చమత్కరించేవారు. రామోజీకీ బహుశా అలాంటి శాపమే ఉన్నట్లుంది.

సీఎంగా జగన్‌ చొరవ, పట్టుదల, కృషి వల్లనే రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల పత్రికలు కోడై కూస్తున్నాయి. అవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయి. టాటాలు, అంబానీ, అదానీలు ఉత్సాహభరితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్నా, దానికి రామోజీ అబద్ధాల పరదాలు కడుతున్నారు.
 
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రా­మి­కాభివృద్ధిలో వేగంగా దూసుకువెళుతోంది. టాటాలు, బిర్లా­లు, అదానీ, అంబానీ, అర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలోనే  రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరి­గా­­యని జాతీయ ఆంగ్ల దిన పత్రికలు ప్రముఖంగా కథ­నా­లు ప్రచురిస్తున్నాయి. అయినా రామోజీ అనే రాష్ట్ర వినా­శకారి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘జగన్‌ అనే నేను ఒక వినాశకారి’ శీర్షికతో ఒక సిగ్గుమాలిన కథనాన్ని వండి వార్చారు.

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వె­స్టర్‌ సమ్మిట్‌లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను జగన్‌ ఆకర్షించారు. ఈ ఐదేళ్లలో 130 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి వచ్చి­నా రామోజీ  రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోయా­యంటూ దిగజారుడు రాతలు రాసిపారేశారు. ఒక పక్క పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రా>మికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తున్నా , పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతు­న్నారంటూ రాయడం ఒక్క రామోజీకే చెల్లుతుంది.  

జీఎస్‌డీపీలో పరిశ్రమల వాటా పెరగడం, ప్రజల తలసరి ఆదాయం పెరగడమే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి  నిలువెత్తు సాక్ష్యం. 2019–­20లో రాష్ట్ర జీఎస్‌డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్ర­మల వాటా 2022–23 నాటికి అది 23.36 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగి­తే మన రాష్ట్రంలో  రూ.26,931కు పెరిగింది.

2021–­22లో రూ.1,92,587­గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరింది.  ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 10.59 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లకు చేరడం ద్వారా ఆరో స్థానానికి ఎగబాకింది. ఇలా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తుంటే పరిశ్రమలపై పగ అంటూ ఈనాడు వంకరరాతలు రాసింది.

అమర్‌రాజా తరలిపోయిందని తప్పుడు ప్రచారం
వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూపు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ ఇక్కడా   విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్‌ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. రామోజీ­కి చెందిన మార్గదర్శి గ్రూపు కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది.

అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మా గ్రూపు వెళ్లిపోయిందని రాయ­గలవా రామోజీ...?తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయాల్లోకి రావడం వల్ల కేంద్ర ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారే కాని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిందని  చెప్పలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజా వెళ్లిపోయిందంటూ కుందేళ్లు, కొరివి దెయ్యాలు..రాక్షసులు అంటూ రామోజీ చందమామ కథలు రాస్తున్నారు. 

అక్క చెల్లెమ్మలకు ఉపాధి
గత ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు అంటూ కేవలం మాటలకే పరిమితమయింది...దీనికి భిన్నంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికోసం అహరహం జగన్‌ శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ ప్రభుత్వం వాస్తవ పెట్టుబడులను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. దీనికి తార్కాణమే ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌. రూ. సుమారు రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా పులివెందులలో యూనిట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల దుస్తులు అక్కడ తయారవుతున్నాయి. రామోజీ వీటి గురించి ఒక్క మాటా రాయరు.

గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒప్పందం కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ గురించి పదేపదే జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విషపూరిత కథనాలను అల్లుతారు. గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన వారు భూకేటాయింపుల్లో భారీగా లంచాలను అడగటంతో జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. జాకీ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభు­త్వం ఎందుకు వాస్తవ రూపంలోకి తీసుకు­రాలేకపోయిందన్న విషయాన్ని చెప్పకుండా ఆ బురదను ఈ ప్రభుత్వానికి అంటగట్టే విధంగా దిక్కుమాలిన రాతలతో పత్రికను నింపేస్తున్నారు.

విశాఖ సమీపంలోని అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్‌ కంపెనీలో స్థానిక మహిళలు రూ.22,000 పైగా జీతంతో పనిచేస్తున్నారు అంటూ రెండు రోజుల క్రితం ఈనాడు వసుంధర పేజీలో ‘‘ ఆ చక్రాలను నడిపించేది వాళ్లే’’ అంటూ రాసిన కథనమే అక్క చెల్లెమ్మలకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉపాధి లభిస్తోందో  చెప్పడానికి ప్రబల సాక్ష్యం.

Election 2024

మరిన్ని వార్తలు