కట్టేసి, కారం చల్లి.. 

29 Mar, 2024 02:52 IST|Sakshi

వేడినీరు పోసి, రోకలిబండతో బాది..

కుటుంబ కలహాలతో భర్తను కిరాతకంగా చంపిన భార్య

సహకరించిన మరో ఇద్దరు.. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఘటన

కరీంనగర్‌ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను అతికిరాతకంగా కడతేర్చిందో భార్య. తాళ్లతో కట్టేసి, కారంపొడి చల్లి, వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన తోట హేమంత్‌(39)కు 2012లో రోహితితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. హేమంత్‌ పెట్రోల్‌బంక్‌లో పనిచేసి మానేశాడు.

రోహితి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్‌ కేర్‌గా పనిచేస్తోంది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొడవ తీవ్రమైంది. దీంతో రోహితి హేమంత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆస్పత్రిలో పనిచేసే నవీన్, సాయికుమార్‌ సాయం కోరింది. బుధవారం రాత్రి వారిని ఇంటికి పిలిచింది. వారు ఇంటికి వచ్చి గేటు, ఇంటి తలుపులు మూసేశారు. ముగ్గురూ కలిసి హేమంత్‌ను తాళ్లతో కట్టేశారు. కళ్లలో కారం కొట్టారు. అనంతరం నవీన్, సాయికుమార్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తరువాత రోహితి హేమంత్‌ శరీరంపై వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణరహితంగా దాడి చేసింది. తల, మర్మాంగాలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో రోహితి అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. హేమంత్‌ తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కన్నతల్లి కళ్లెదుటే..: తన కళ్లెదుటే హేమంత్‌ను కొట్టారని, కొట్టొద్దని బ్రతిమిలాడినా వినలేదని విమల రోదించింది. వేడినీళ్లు, కారంపొడి పోస్తూ దాడి చేశారని, ముగ్గురు పిల్లలున్నారు వద్దన్నా వినకుండా చంపేశారని భోరుమంది. పథకం ప్రకారమే హేమంత్‌ను నిందితులు చంపారని బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి నవీన్, సాయికుమార్‌ పలుమార్లు ఫోన్‌ చేశారని హేమంత్‌ తమకు చెప్పాడన్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చి పథకం ప్రకారం దాడిచేసి చంపారని ఆరోపించారు.

Election 2024

మరిన్ని వార్తలు