అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!

28 Mar, 2024 13:02 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

అమెరికా పబ్లిక్ లైబ్రరీల్లో ఎన్నో సౌకర్యాలు

లైబ్రరీల్లో పిల్లలకు ప్రత్యేక సెక్షన్లు

చదువుకోవచ్చు.. కొనుక్కోవచ్చు

నా వాలెట్ లో అత్యంత విలువైన వస్తువు నా లైబ్రరీ కార్డు అని తెలుసుకున్నా ! : లారా బుష్ ( అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్ గారి సతీమణి ) నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నా మనసులో పదేపదే మెదిలిన ప్రశ్న ‘ అమెరికాలో ఉన్నదేమిటి ఇండియాలో లేనిదేమిటి ? ’ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించింది, చాలామంది మనవాళ్లయితే కూర్చున్న సీట్ ముందున్న టివీల్లో వరసగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ, అదే తెల్లవాళ్ళు ఎక్కువ మంది పుస్తక పఠనం చేస్తూ కాలక్షేపం చేయడం. పాశ్చాత్యులకున్నంత ‘ బుక్ రీడింగ్ ’ అలవాటు మనకు లేదనేది వాస్తవం. ఆ దేశంలోని గ్రంథాలయాలను చూసినప్పుడు కూడా ఇలాంటి తేడానే నాకు స్పష్టంగా కనబడింది.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో ( 1971 ) నేను ఎక్కువగా వెళ్ళింది కోఠి సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం . ఆ తర్వాత కాలంలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ , ఆఫ్జల్ గంజ్‌ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అప్పట్లో సెక్రటేరియట్ ఎదురుగా నున్న బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ వంటి వాటికి. వాటితో పోల్చుకున్నప్పుడు అమెరికాలోని ఏ చిన్న పట్టణానికి వెళ్లినా అక్కడ విశాలమైన భవనాల్లో, వేల పుస్తకాలతో , కూర్చొని చదువుకోడానికి అన్ని సౌకర్యాలున్న పబ్లిక్ లైబ్రరీలు చూడవచ్చు. అందులోనే జిరాక్స్ , wifi, చిన్నపాటి కేఫ్‌లు ఉండడం వల్ల బయటికి పోవాల్సిన అవసరం రాదు.

ప్రతి లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేక సెక్షన్ పెట్టడం విశేషం. ఎంతోమంది గృహిణులు తమ పిల్లలను లైబ్రరీలో దింపేసి నిశ్చింతగా షాపింగ్ వంటి పనులకు వెళ్ళిరావడం గమనించాను. అక్కడ పనిచేసే లైబ్రరియన్లు ఎంతో ఓపికతో మనకు కావలసిన పుస్తకం దొరకడం లేదంటే వచ్చి వెతికి పెట్టడం చూసాను. లైబ్రరీ సభ్యత్వ కార్డు ఉంటే చాలు పుస్తకాలు తీసుకెళ్లడం, డ్రాప్ బాక్స్ సౌకర్యం వల్ల వాటిని రిటర్న్ చేయడం సులభం. అక్కడి గ్రంధాలయ ఉద్యోగులు చేసే మరో అదనపు సేవ లైబ్రరీకి విరాళంగా వచ్చే పాత పుస్తకాలు అమ్మడం. లాస్‌ ఎంజెలిస్‌ టొరెన్స్ పబ్లిక్ లైబ్రరీలో నేనలా కొన్న పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవి Chronicle of the World (1988 edition, 1300 pages) ఆదిమానవుడి నుండి ఆధునికుల వరకు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు సంవత్సరాలవారిగా ఎన్నో ఫోటోలతో సహా వివరణలున్నది.

Literature ( Reading Reacting Writting ) 1991 edition , 2095 pages. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా! అని Oxford , American Heritage వంటి డిక్షనరీలు కూడా కోనేశాను. ఒక్కో పుస్తకానికి నేను చెల్లించినవి 2-4 డాలర్లు మించలేదు. అవి కూడా ఇంట్లో నున్న చిల్లర నాణాలన్నీ తీసుకెళ్లి ఇచ్చినా విసుక్కోకుండా , లెక్కపెట్టుకొని తీసుకున్న లైబ్రేరియన్ లకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ సందర్బంగా కొన్ని బార్న్స్ అండ్‌ నోబెల్ వంటి ప్రైవేట్ పుస్తక విక్రయశాలలకు కూడా వెళ్లి చూసాను.

కొనుగోలుదారులకు వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా తక్కువేం కాదు, కొత్తకొత్త పుస్తకాలు అక్కడా కూర్చొని చదువుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టకపోవడం విశేషం. వాళ్ళ దగ్గర నేను కొన్నవి తక్కువ. ఎంపిక పేర చదివినవే ఎక్కువ. అయితే నాకు వచ్చిన చిక్కల్లా అమెరికాలో నేను అలా సేకరించిన పుస్తకాలను ఇండియాకు తేవడంలోనే. మనవాళ్లలో ఎక్కువ మంది లగేజీ బట్టలు, వస్తువులతో నింపేస్తారు కానీ.. పుస్తకాలు తీసుకురావడానికి ఆసక్తి చూపించరు. ఏం చేద్దాం మరీ.?
వేముల ప్రభాకర్‌

(చదవండి: మెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్‌ అర్థమవ్వాలంటే మాత్రం..!)

Election 2024

మరిన్ని వార్తలు