ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు: సీఎం జగన్‌

28 Mar, 2024 15:01 IST|Sakshi

సాక్షి, నంద్యాల: అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్‌లు నొక్కి.. నేరుగా అకౌంట్‌లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజైన గురువారం ఉదయం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. 

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా.. అర్హత ఉంటే చాలూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారు అని సీఎం జగన్‌ వివరించారు. ఈ సందర్భంగా.. వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు.

ఎర్రగుంట్లకు సంబంధించి..

  • అమ్మ ఒడి కింద ఒక్క ఎర్రగుంట్లలో 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది.. రూ. 4.69 కోట్లు అందించారు
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ. 3 కోట్లకు పైగా అందించారు
  • ఎర్రగుంట్లలో ఆరోగ్యశ్రీ కింద రూ. 2 కోట్లకుపైగా అందించారు
  • ఎర్రగుంట్లలో 1,496 ఇళ్లకుగానూ 1391 ఇళ్లకు లబ్ధి చేకూరింది
  • ఎర్రగుంట్లలో చేదోడు కింద రూ. 31.20 లక్షలు అందించారు
  • మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో రూ. 48.74 కోట్లు అందించారు
  • ఎర్రగుంట్లలో 93.06 శాతం మందికి సంక్షేమం అందింది


నా కంటే ముందు చాలామంది సీఎంలుగా చేశారు. నా కన్నా వయసు, అనుభవం ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేశారు. నా కంటే ముందు 75 ఏళ్ల వయసున్న ఓ ముసలాయన కూడా పరిపాలన చేశాడు. వయసులో నేను చాలా చిన్నోడిని. ఈ చిన్నోడిగా అడుగుతున్నా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా?.  ఆలోచన చేయండి.. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి అని సీఎం జగన్‌ ఎర్రగుంట్ల ప్రజలను కోరారు. 

గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు నాడు-నేడుతో మారిపోయాయి. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించండి. ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు. మన భవిష్యత్తు కోసం ఓటేయాలి. జరిగిన మంచిని చూసి ఓటేయండి’’ అని సీఎం జగన్‌ ఎర్రగుంట్ల ప్రజల్ని కోరారు.

👉: ‘మేమంతా సిద్ధం’ రెండో రోజు బస్సు యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

Election 2024

మరిన్ని వార్తలు