Botsa Jhansi Lakshmi: పుట్టినింటి రుణం తీర్చుకుంటా

28 Mar, 2024 10:02 IST|Sakshi

విశాఖ పార్లమెంట్‌ చరిత్రలోతొలిసారి బీసీ మహిళకు అవకాశం కల్పించారు

ఈ ప్రాంత ఆడపడుచుగా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటా..

సీఎం జగన్‌తో మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమైంది

విశాఖ విజన్‌ కోసం నాడు పార్లమెంట్‌ సాక్షిగా కృషి చేశా..

వైఎస్సార్‌ సీపీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి

సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖే నా పుట్టినిల్లు.. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇక్కడే చదువు పూర్తి చేశాను. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నేను పార్లమెంట్‌లో విశాఖ నగర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం పలుమార్లు ప్రస్తావించాను. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. ఇదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం. రాష్ట్ర భవిష్యత్‌కూ విశాఖే ఆశాకిరణం. విశాఖ పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బీసీ మహిళనైన తనకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కలిగింది. ఈ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత ఆడపడుచుగా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటా.. విశాఖ అభివృద్ధి కృషి చేస్తా.’ అని వైఎస్సార్‌ సీపీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

మెట్టినింటి నుంచి పుట్టినింటికి..
దశాబ్దాల కాలంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష. ఉత్తరాంధ్రలోని విశాఖ నగరం పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. విశాఖ నాకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలోనే నా బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేశాను. విశాఖ ప్రజలకు ఏం కావాలో.. విశాఖను ఎలా అభివృద్ధికి చేయాలో.. నిధులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఈ ప్రాంత ఆడపడుచుగా విశాఖ ప్రగతికి కృిషి చేస్తాను. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.

సంక్షేమ పథకాలతో మహిళల ఆర్థిక స్వావలంబన
‘ఇంటికి వెలుగు ఇల్లాలే..’అన్నట్టుగా ప్రతీ ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది. అలాంటి పాలన 2019–2024 వరకు చూశాం. ఎంతో ముందు చూపుతో.. పెద్ద మనసుతో మహిళలే లబ్ధిదారులుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. వైఎస్సార్‌ చేయూత, అమ్మ ఒడి, ఆసరా, చేదోడు, గృహ నిర్మాణం, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళల ఖాతాలకే డీబీటీ పద్ధతిలో నగదు జమ చేసి.. ఆర్థికంగా బలోపేతం చేశారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. మరింత ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా అర్బన్‌ ప్రాంతంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. ఎక్కడా అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా యావత్‌ దేశం ప్రశంసించేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగింది.

స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల హక్కు
గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పని చేసిన నేను విశాఖకు అవసరమైన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్‌లో గళం విప్పాను. బీహెచ్‌ఈఎల్‌, బీహెచ్‌వీఎల్‌ విలీనం ప్రక్రియ, షిప్‌యార్డు వెస్సెల్స్‌ కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించాను. విశాఖ నగరానికి మెట్రో రైలు తీసుకురావాలని, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటివి మహానేత వైఎస్సార్‌ హయాంలో ఆలోచన చేశాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. భావితరాల భవిష్యత్‌ కోసం వేలాది ఎకరాల భూములను ఇక్కడి ప్రజలు త్యాగం చేశారు. భవిష్యత్‌ బాగుంటుందనే భూములిచ్చారు.. ప్రైవేటీకరణ కోసం కాదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ కృషి చేస్తోంది. ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌, విశాఖ స్టీల్‌ పరిరక్షణ బాధ్యతను ఈ ప్రాంత ఆడపడుచుగా తీసుకుంటాను. నేను ఎంపీగా గెలిచి.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఉద్యమిస్తాను. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అందరం కలిసి అడ్డుకుందాం.

అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్‌ చేస్తాం
విశాఖ పార్లమెంట్‌ పరిధిలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు కోల్పోయాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసిన ప్రజలు.. ఈ సారి అన్ని సీట్లలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.ప్రచారానికి వెళ్తున్న సమయంలో లబ్ధి పొందిన మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను చూసి ఐక్యరాజ్యసమితిలో పెద్దలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల భవిష్యత్‌ను సీఎం జగన్‌ తీర్చిదిద్దుతున్నారు. పేదోడి ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచారు. విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి సీఎం జగన్‌తో సాధ్యమైంది.

విశాఖే రాష్ట్ర భవిష్యత్‌
రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. రాష్ట్రానికి విశాఖ లాంటి ప్రాంతం రాజధానిగా అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్‌ అంతా విశాఖ నగరమే. విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, విమాన, ఓడ రేవు కనెక్టవిటీ ఉంది. ఆనాడు మహానేత వైఎస్సార్‌ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపేలా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటు పడింది. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ అంతకుమించి ఉత్తరాంధ్ర కోసం ఆలోచన చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే దేశంలోనే టాప్‌ నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. విశాఖ పార్లమెంట్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందడుగు వేయాలి.
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers