#srhvsmi: మా బౌలర్ల తప్పు లేదు.. వారి వల్లే ఓడిపోయాం: పాండ్యా

28 Mar, 2024 12:33 IST|Sakshi
ముంబై దారుణ ఓటమిపై స్పందించిన పాండ్యా(PC: IPL)

IPL 2024: Hardik Pandya backs bowlers after SRH mauling: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఐపీఎల్‌-2024లో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.

ముఖ్యంగా బౌలర్ల వైఫల్యం కారణంగా ప్రత్యర్థి జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికే 277 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తే.. ముంబై పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన ముంబై సారథి హార్దిక్‌ పాండ్యా ఉప్పల్‌ వికెట్‌ బాగుందని.. ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఇంత స్కోరు నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదన్నాడు.

‘‘ఈ వికెట్‌ చాలా బాగుంది. ఇక్కడ బౌలర్లు ఎంత మంచిగా బౌలింగ్‌ చేసినా.. ప్రత్యర్థి 277 పరుగులు స్కోరు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయంలో క్రెడిట్‌ రైజర్స్‌ బ్యాటర్లకు కూడా ఇవ్వాలి. 

నిజానికి..  టాస్‌ సమయంలో.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంత స్కోరు చేస్తుందని అనుకోలేదు. వాళ్లను కట్టడి చేయడానికి మా బౌలర్లు బాగానే ప్రయత్నం చేశారు. కానీ పిచ్‌ వారికి అనుకూలించలేదు. ఇక్కడ 500కు పైగా పరుగులు స్కోర్‌ అయ్యాయంటే.. వికెట్‌ బ్యాటర్లకు అనుకూలించిందనే అర్థం కదా!

ఏదేమైనా ఇప్పుడు మా జట్టులో చాలా మంది యువ బౌలర్లే ఉన్నారు. ఈ మ్యాచ్‌ నుంచి వాళ్లు పాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు క్వెనా మఫాకా అద్భుతంగా ఆడాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. 

తనకిది మొదటి మ్యాచ్‌. ఇక్కడ కుదురుకోవడానికి తనకు ఇంకాస్త సమయం కావాలి. మా బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. కానీ.. సరైన సమయంలో రాణించలేకపోయారు’’ అని హార్దిక్‌ పాండ్యా తమ బౌలింగ్‌ విభాగాన్ని సమర్థించాడు. 

కాగా ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాండ్యా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 246 పరుగుల వద్దే నిలిచి.. తాజా ఎడిషన్‌లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇదిలా ఉంటే..  ఈ మ్యాచ్‌ ద్వారా సౌతాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల పేసర్‌ క్వెనా మఫాకా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 

Election 2024

మరిన్ని వార్తలు