సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు 

6 Nov, 2017 19:31 IST|Sakshi

జన్మనక్షత్రం తెలియదా?  నో ప్రాబ్లమ్‌!  మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం  (జనవరి 19 నుంచి 25 వరకు)  మీ రాశి ఫలితాలు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహదేవా! అనేది సామెత. ఎవరెంతగా విధి నిర్వహణలో శ్రమ పడితే అంతగా సంస్థలోని ప్రముఖుల దృష్టిలో పడే అవకాశముంది. అలాగని వాళ్ల దృష్టిలో పడేందుకోసం నటన చేస్తూ వాళ్ల దృష్టిని ఆకర్షించేందుకే విధి నిర్వహణని గాని చేస్తే పై అధికారుల దృష్టిలో అది మరో తీరుగా పడే అవకాశముంది. ఎంతో రుచిగా ఉండే పెరుగు ఎలా పాలనుండి పెరుగుగా మారిందో మన దృష్టిలో పడనే పడదు. అయితే పలితంగా కనిపించిన పెరుగు ద్వారా ఆ పాలూ మజ్జిగల మిశ్రమపు గొప్పదనాన్ని లెక్కిస్తాం కదా! అదే తీరుగా మీరు మీ పనిని సక్రమంగానూ సకాలంలోనూ పూర్తి చేస్తూ ఉండండి అది చాలు.
అనుకోకుండా మీ భార్యవైపు నుండి వారి పుట్టింటి వారికి కలిగిన స్థాయి ప్రకారం ధనం లేదా బంగారం వంటి వస్తువులు లభించే అవకాశముంది. కాదనకండి.
తక్కువైందంటూ నిర్బంధించకండి. మరెవరితోనో పోటీ పెట్టుకుని ఈ ఇస్తున్నదాన్ని తృణీకరించకండి. మంచి జరగబోయే అవకాశముంది.

ఎంతటి ఇనుప యంత్రమైనా నిర్విరామంగా గాని పని చేస్తూంటే చేయిస్తుంటే తప్పక మరమ్మతుకి గురి ఔతుంది. మీ శరీరాన్ని కూడా ఇదే పోలికతో సరైనంత పనిని మాత్రమే చేయిస్తూ ఉండండి తప్ప అత్యాశకి పెయి శరీరాన్ని విపరీతంగా శ్రమకి గురి చేయకండి.మీరరే గనక పారిశ్రామిక వేత్తలయ్యుంటే విదేశీ ఆహ్వానాలు లభింవచ్చు. విదేశాహ్వానం కదా! అని మురిసిపోకండి. ముందూ వెనకా ఆలోచించుకుని మాత్రమే దిగండి పనిలోకి. ప్రస్తుతం ఈ రాశివారు చేసే జీవ (చేపలు...) .జంతు(... గొర్రెలు, మేకలు.. ) వ్యాపారాలు బాగా ఉండకపోవచ్చు.


లౌకిక పరిహారాలు: ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండండి.
అలౌకిక పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి.

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

పిల్లలిద్దరికీ చెరొక్కటి అనే సూత్రం ప్రకారం మరో ఇంటిని కొనే ఆలోచనకొస్తారు. కొద్దిగా రుణాన్ని తీసుకుని ఆ పనిని పూర్తి చేసే అవకాశం బలంగా ఉంది. ఈ దశలో మీకు అత్యంత ఆప్తుడు కొద్దిగా సొమ్ముని రుణంగా కావాలని అడిగే సూచన ఉంది. ఇయ్యలేనని మొగమాటం లేకుండా చెప్పండి తప్ప ఇంతైతే ఇయ్యగలనంటూ ఆ సొమ్ములో నుండి ఇయ్య దలచడం ఇయ్యడమంటే అది కుటుంబానికి చేస్తున్న ద్రోహంతో సమానమే. (పెద్దమాటలనుకోకండి). రోజు మారితే పరిస్థితులెలా ఉంటాయో తెలియని కాలంలో ముందు నాటికి వేరే అవసరం మీకొస్తే ఇల్లు కాస్తా వెనక్కి పోవచ్చు.

మీ వ్యాపారం వృత్తి ఉద్యోగం వంటి అన్నీ మీరనుకున్న ప్రణాళికకి అనుగుణంగానే నడుస్తూ చక్కని ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటాయి. కటుంబంలో భార్యాభర్తల మధ్య సదవగాహన ఉంటూండడం చెప్పుకోదగ్గ అభివృద్ధే. ఇద్దరిలో ఒకరికి అకస్మాత్తుగా వచ్చే తీవ్ర స్థాయి కోపం కారణంగా అప్పుడప్పుడు ఒడుదుడుకులకి గురి అవుతూ ఉండొచ్చు. సమయమనం పాటించడం తప్పనిసరి. మీపట్ల అసూయా ద్వేషాలతో ఏవో కొన్ని అపప్రచారాలూ అడ్డంకులూ సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే మీరు ఎంత శ్రమిస్తారో, ఉద్యోగ వ్యాపార వృత్తుల పట్ల ఎంత నిజాయితీతో నిబద్ధతతో ఉంటారో తెలిసిన మీ పైవాళ్లు మీ అదృష్టవశాత్తూ ఆ మాటల్ని నమ్మకపోవడం, తద్వారా మీకు ఇబ్బంది లేకపోవడం.. అనే ఇంత పరిస్థితికీ కారణం– మీరు ఆచితూచి మాత్రమే మాట్లాడడమే.
ఎవరు ఎంత అడ్డుపడినా అంతిమ విజయం మాత్రం మీదే.కంఠానికీ మెడకీ ఇటు అటు భుజాలకీ సంబంధించిన నొప్పులూ వాపులూ వచ్చే అవకాశముంది కాబట్టి కొద్దిగా ఆ అవయవాల ఆరోగ్యవిధానం పట్ల జాగరూకత తప్పనిసరి.

లౌకిక పరిహారాలు: భార్యాభర్తల మధ్య అవగాహన పట్ల శ్రద్ధని వహించండి.
అలౌకిక పరిహారాలు: ఆర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి.

మిథునం (మే 21 –  జూన్‌ 20)
గరుడం పప్రచ్ఛ కౌశలమ్‌ అని సంస్కృతంలో ఓ సామెత. ఎప్పుడూ గరుడునికి భయపడే వాసుకి మెల్లగా శంకరుని కంఠానికి ఆభరణం అయ్యాడు. అలా ఉన్న కాలంలో గరుడుడు శంకరుని దగ్గరికి ఏదో పనిమీద రాగానే వాసుకి అడిగాడుట గరుడుణ్ణి ‘ఏమోయ్‌ కులాసాగా ఉన్నావా?’ అని. అలా మీకు గట్టివాళయ్లిన పెద్దల పరిచయం లభించడంతో మీ పై అధికారులతో కూడా గట్టిగా వాదించడం ప్రారంభిస్తారు. గుర్తుంచుకోండి– శ్రుతి మించకూడదని.ఏదో ఒక స్థిరమైన ఆస్తిని సంపాదించుకోవాలనే బలమైన నిర్ణయానికొస్తారు. దానికోసమంటూ కృషి చేస్తారు. సంతానమే ఇప్పటికీ లేకపోవడమో లేక ఉన్న సంతానం సరైన ధోరణిలో లేకపోవడమో కారణంగా మానసిక వేదనతో ఉంటారు. పిల్లల ప్రవర్తన మీద మీ భార్యాభర్తల ఫ్రభావం హెచ్చుగా ఉండే అవకాశముంది. ప్రశాంతవేళలలో నిదానంగా వివరించి చెప్పండి. లేనిపక్షంలో సంసారం బయటపడిపోతుంది. చులకన అయిపోతారు కూడా.

చేస్తున్న ఉద్యోగంలో పదవీ ఉన్నతీ లేదా స్థిరీకరణం వంటివి జరిగే అవకాశముంది. ప్రస్తుతం నడుస్తున్న దశకి అనుగుణంగా మీకు పదవీ ఉన్నతి రాగానే ఆమె బదలీ మీద మరో స్థలానికి వెళ్లవలసి రావచ్చు లేదా మీరే మరో దూరంలో ఉద్యోగాన్ని చేయవలసి రావచ్చు– మొత్తానికి ఒకచోట ఉండే వీలు ఉండకపోవచ్చు.పాత సంఘటనలని కళ్లముందుకొచ్చేలా చేసుకోవడం వల్ల సమయనష్టం మానసిక అశాంతి ఆరోగ్యభంగం వీటితోపాటు గుండె ఆ బరువుకి తట్టుకోలేని కారణంగా ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ముగ్గురికీ చేరవేయడం– తద్వారా అందరికీ మన కుటుంబ సమాచారం చేరిపోవడం– ఆ సమాచారానికి వారి వారి పైత్యం జోడింపబడి ఊరంతా ప్రచారం కావడం జరిగిపోతుంది. కాబట్టి భూతకాలానికి వెళ్లకండి.

లౌకిక పరిహారాలు: జరిగిన జీవితంలో దుఃఖ సంఘటనల్ని గుర్తు చేసుకోకండి.
అలౌకిక పరిహారాలు: శ్రీ విష్ణు సహస్రనామ పఠనం మంచిది.

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

మీ దంపతిలో ఒకరివల్ల మీ కుటుంబ రహస్యాలన్నీ క్రమంగా బయటపడిపోతూ ఉంటాయి. ఇలా ఎందుకు చెప్పడమని మీరు అనేలోగా విషయం వాదంలోకి జారిపోయి పదిమందికీ విన్పడే తీరులో కంఠధ్వని పెరిగి కొండమీద రహస్యమేమిటంటే ఫలానివారి కుటుంబ విషయాల చర్చ అని అనిపించుకునేలా వాదం సాగిపోవచ్చు. వాదం వైపుకి మాటలు వెళ్లబోతున్నాయనిపిస్తే వెంటనే ఏదో వంక పెట్టుకుని ఆ ప్రదేశాన్ని విడిచిపొండి.మీ ఇంటి విషయాల గురించి ఎవరైనా వచ్చి చర్చించబోతుంటే లేదా సలహాలనియ్యదలిస్తే– ఫలాని వారొచ్చారు, మన ఇంటి సమస్య గురించి చర్చించబోతున్నారుట– మనకేదో మంచి చెప్పదలిచి సిద్ధంగా ఉన్నాడట– అని స్పష్టంగా అందరి మధ్యలో చెప్పండి– మా కుటుంబ విషయాలు మీకనవసరమని. తన భార్య రుమనీ, కిష్కింధారాజ్యాన్ని పోగొట్టుకున్న సుగ్రీవుని వద్దకి రాముడు వెళ్లి తన భార్య సీతని ఎవరో ఎత్తుకుపోయారనీ– రాజ్యం కూడా లేనివాడిననీ దుఃఖిస్తూ చెప్పాడు.

రాముడన్నాడు కదా– రాజ్యం పోతేనేం, భార్య లేకపోతేనేం? ధైర్యంగా ఉండాలి. దుఃఖపడకు– అని. నిజంగా సుగ్రీవుడు తీవ్రంగా దుఃఖిస్తూనే ఉన్నాడు. అయితే రాముడొచ్చి చెప్పేసరికి ధైర్యాన్ని చెప్తున్నాడు (లో లోపల ఏడుస్తూ). అలాగే ప్రతివాళ్లూ వాళ్ల ఇంటి పరిస్థితుల్ని మనకి సలహాలనిచ్చేటప్పుడు గుర్తుంచుకోరు. కాబట్టి మీ ఇంటి విషయాలు బహిరంగ చర్చకి చర్చనీయాంశాలు కాకూడదు. దానివల్ల పిల్లల పెళ్లిళ్లు కూడా చెడిపోయే అవకాశాలు రావచ్చు. అది ఇప్పుడు తెలియదు.ఉద్యోగంలో సమయ పాలన మీకు తప్పనిసరి. శత్రువులున్నారనీ గమనించుకోండి. దీనిక్కారణం ఉద్యోగ నిర్వహణలో మీకున్న నైపుణ్యమూ వాళ్లకి గుర్తించదగిన నేర్పరితనం ఏమీ లేకపోవడమున్నూ.

లౌకిక పరిహారాలు: ఇంటి విషయాలని బయటికి పోనీయకండి. ఈ వారం అతి ముఖ్యం.
అలౌకిక పరిహారాలు: దుర్గాదేవీ స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉండండి.

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

శ్రీమద్రామాయణంలో రాముడు అరణ్యాలకి వెళ్తూ లక్ష్మణునితో తనతో రావడం పైగా అరణ్యాల్లో ఉండడం కష్టం కాబట్టి రావద్దన్నాడు. దానికి లక్ష్మణుడు బదులిస్తూ – అక్కడ కౌసల్యామాతతో మాట్లాడుతూ దశరథుణ్నీ భరత శత్రుఘ్నుల్నీ చక్కగా చూసుకోవలసిందనే చెప్పావు గదా! అంటే నన్ను నీతో తీసుకుపోతున్నావనేగా దానర్థం. రెండు మాటలు మాట్లాడని నీకు నన్ను తీసుకుపోకపోవడం సబబా? అన్నాడు. సరిగ్గా ఇలాగే మీ వృత్తిలో, వ్యాపారంలో వచ్చిన చిక్కుని అప్పటికప్పుడే మీ నేర్పరితనంతో క్షణంలో తొలగించేసుకుంటారు. ఏమౌతుందో ఆ చిక్కు? అని భయపడకండి. మంచి కాలం మీకు ఇది. వివాదాలు రాబోతున్నాయని భయపడకండి. వెలుగులో నిలబడి చీకట్లోకి చూస్తే కనిపించేదంటూ ఏమీ ఉండదు. చీకట్లో నిలబడి వెలుగులోకి చూస్తే, అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అన్నిటినీ గమనిస్తున్న మిమ్మల్ని ఎవరూ చూడ(లే)రు కూడా.

అలాగే వివాదాలు మీరు లోగడ చేసిన కొన్ని పొరపాట్లు కారణంగా రాబోతున్నాయంటే స్పష్టంగా మీ పొరపాటుని అంగీకరించండి తప్ప దాన్ని ఎటెటో తిప్పడం – లేదా – తప్పుని మరొకరి మీదకి నెట్టే ప్రయత్నాన్ని చేయడం వద్దు. లౌకికమైన న్యాయం ప్రకారం మీరు చేసిన తప్పిదాన్ని కాగితం మీద పెట్టకండి. పెద్ద ప్రవాహం బాగా వేగంగా వస్తే అడ్డుగా, బలంగా నిలిచే తాడిచెట్టు, కొబ్బరిచెట్టు, అరటి వంటివి పడిపోతాయి తప్ప తలవంచి నిలిచే చిన్న చిన్న మొక్కలకి ఏ విధమైన ప్రాణ భయమూ ఉండదు. ప్రవాహం తగ్గాక పెద్ద చెట్లని పెరికి వేస్తారు గాని చిన్న మొక్కలు ప్రవాహానికి సాక్షులుగా అలా నిలిచే ఉంటాయి. ఎదుర్కోవడం కంటే అంగీకరించడమనేది నిజంగా తప్పు జరిగిన పక్షంలో సరైన ఉపాయం. మీమీద ఉండే గౌరవం కారణంగా ధనంతో సన్మానం జరుగుతుంది. ఇతరులకి మీమీద ఉండే ప్రతిష్ఠని కాపాడుకుంటూ ఉండండి.

లౌకిక పరిహారాలు: తప్పిదాన్ని ఒప్పుకోండి. లిఖితపూర్వకంగా వద్దు.
అలౌకిక పరిహారాలు: లలితా సహస్ర నామ పఠనం మంచిది.

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

తన పనిని సాధించుకునేవాడు ఉత్తముడు. తన పనిని చేసుకుంటూ ఇతరులక్కూడా సహాయాన్ని చేస్తూ తనకి కొంత ప్రయోజనాన్ని దీనిద్వారా పొందేవాడు మధ్యముడు. తనకీ ఇతరులకీ కూడా పనిచేయడం తెలియని కారణంగా పని కాకుండా చేసుకునేవాడు అధముడు. ఇంతవరకూ బాగానే ఉంది గాని, మీరు ఏ పనిని చేపట్టినా కావాలని అడ్డుపెడుతూ ఉండే వ్యక్తులున్నారు కాబట్టి ప్రతి పనినీ శ్రద్ధతో, అవగాహనతో చేసుకోండి. ఎదుటివాళ్లు అంతగా ప్రయత్నించినా మీదే అంతిమ విజయం. దాన్నే దైవానుకూలత అంటారు. అది మీకు పుష్కలంగా ఉంది.

కళా సాహిత్య రంగాల్లో ఉన్నవాళ్లకి మంచి అవకాశాలొస్తాయి. ధన లాభం కూడా ఉంటుంది. చేస్తున్న వ్యాపారం కూడా కలిసొస్తుంది. అయితే అత్యాశకి పోవడం మాత్రం సరికాదు. నష్టపోతారు కూడా. ఉద్యోగాల్లో ఒకప్పుడు పెట్టిన ఒత్తిడి ప్రస్తుతం ఏ మాత్రమూ లేకపోయే కారణంగా మనశ్శాంతిగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకి చెందినవారు మాత్రం అతి ముఖ్యమైన పత్రాలని భద్రంగా ఉన్నదీ లేనిదీ గమనించుకోవడం తప్పనిసరి. అనవసరమైన కాగితాల్లో అత్యవసరమైన కాగితాలు కలిసిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త! అలాగే వాహనాలూ ఇళ్లూ పొలాలూ మొదలైనవాటికి చెల్లించవలసిన పన్నుల విషయాలని ఒక మారు పరిశీలించుకుని ఉండడం తప్పనిసరి. లేని పక్షంలో ఈనాటి చిన్న పని రేపటికి పెద్దపనిగా అయిపోయి కొన్ని రోజుల కాలాన్ని ధ్వంసం చేయవచ్చు. జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్యం ఇప్పటికే ఉన్న మీకు తిండి విషయంలో జాగ్రత్తని పాటించని పక్షంలో మీ వ్యాధే మిమ్మల్ని అనుక్షణం గుర్తుచేస్తూ మీ విలువైన సమయాన్ని వైద్యుని వద్ద నిరీక్షణం నిమిత్తం వ్యయం చే(యి)స్తుంది. సకాలంలో చిరుగుని కుట్టుకుంటే మొదటికి మోసం రాదు. గమనించుకోండి!

లౌకిక పరిహారాలు: అతి ముఖ్యమైన పత్రాలని భద్రం చేసుకోండి! ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి!
అలౌకిక పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి రోజూ.


తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

భారత కథలో దుర్యోధనుడు మయసభలోకి ప్రవేశించి చక్కగా సమతలంగా ఆకుపచ్చని పచ్చికతో ఆకర్షణీయంగా కప్పినట్టుగా ఉన్న భూమిలో నడుచుకుంటూ వెళ్లి నీటి గోతిలో పడ్డాడు. దాంతో ఆ సంఘటన కురుక్షేత్రం దాకా సాగి సాగి చివరికి దుర్యోధనునికి చెడ్డ పేరూ సోదరులందరి మరణం అతనికి ఫలితాలుగా అయ్యాయి. గమనించుకోండి.ప్రస్తుత పరిస్థితి మీకు లాభకరంగానూ, మీ మాటే నెగ్గుతున్నట్లుగానూ, బంగారపు భవిష్యత్తు మీ ముందు కదలాడుతున్నట్టూనూ మీకు అనిపిస్తూండవచ్చు. సుకృతం దుష్కృతం చైవ... అని సంస్కృతంలో ఓ మాట ఉంది. మన శరీరం వెంట ఉండే నీడ మన ఆకారంలోనే ఎలా నడిచి వస్తూంటుందో అలాగే మీరు (కావాలని) చేసిన చెడ్డ పనులే మీ వెనుక నడుస్తూ మిమ్మల్ని కుంగదీయచ్చు. పట్టుదల అనేది బుద్ధిని పూర్తిగా కప్పేస్తుంది. ఆలోచించనీయదు. ఒంటికి పట్టించుకుని ఈ విషయాన్ని గ్రహించుకోండి.

శారీరకంగా గాని చూస్తే మీకు శిరస్సులో ఉండే అతిముఖ్యమైన అవయవాలు అంటే కళ్లలో పార్శ్వ భాగాల్లో (కణతలలో) వీటితోపాటు చెవులలో వ్యాధి ప్రవేశించి ఉంది. సరైన వైద్యునికి తేలికపాటి వ్యయమయ్యే తీరులో తాత్కాలికంగా చూపించుకోండి. అవసరమని తోస్తే ఆ మీదటి కర్తవ్యాన్ని చూద్దాం! పురాణంలోని మారుమూల కథ! గుర్రం ఓసారి లేడితో పరుగు పందాన్ని పెట్టుకుంది. లేడి గెలిచిపోయింది. లేడి గొప్పదనాన్ని తగ్గించాలనే భావంతో గుర్రం మనిషిని ఆశ్రయించి – తనని ఎక్కి, తనకంటే వేగంగా పరిగెత్తే ఆ లేడిని చంపి తన పగ తీర్చవలసిందిగా కోరింది! వ్యక్తి గుర్రాన్నెక్కుతూ ఉన్నాడే గాని లేడిని చంపే ఉద్దేశ్యమే లేకపోయింది అతనికి. గుర్రంతో సేవని చేయించుకుంటూనే ఉండిపోయాడు.

లౌకిక పరిహారం: ఒకరి మీది పగతో మరొకరిని ఆశ్రయించకండి.
అలౌకిక పరిహారం: హనుమత్‌ స్తోత్రాన్ని జపించుకుంటూ ఉండండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

రాముడంటాడు కదా – ‘రామోస్మి సర్వం సహే’ – అని. నేను ఏ కష్టం వచ్చినా భయపడను. తట్టుకోగలను. దానిక్కారణం కష్టాలకీ దుఃఖానికీ అలవాటుపడిపోయిన రాముణ్ని కదా నేను! ఎంతటిదాన్నైనా సహిస్తానని పైవాక్యానికర్థం. ప్రస్తుతం మీది అదే పరిస్థితి. ‘పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాద’ని సామెత. ప్రస్తుతం శని అననుకూలుడుగా ఉన్న కారణంగానూ ఇక మెల్లగా తొలగిపోబోతున్న సందర్భంగా తన ఉద్యోగ కర్తవ్యం ప్రకారం అలా మనోవ్యథని కలిగిస్తూనే ఉంటాడు మరికొంత కాలం. అయితే ఒంటి నిండుగా గోనె సంచుల్ని చుట్టి, దానిమీద కొడితే ఎలా వ్యక్తికి దెబ్బ తగలదో, అయితే పరువూ ప్రతిష్ఠా పోతుందో, సరిగ్గా అలాంటి స్థితి మీది. న్యాయస్థానంలో ఎన్ని కాగితాలని దాఖలు చేసినా వ్యతిరేక ఫలితమంటూ మీకు రాదు గాని, నలుగురిలో చిన్నతనం అనిపించకమానదు. చిత్రమేమంటే ఇటు ఆర్థికంగా బలపడుతూండడం, మీ సోదరుల్లో ఒకరికో ఇద్దరికో వస్తు వాహనాల్ని కొనుగోలు చేయదలిస్తే వడ్డీ లేకుండా బదుళ్లని ఈయడం, బంధువుల వద్దకి రాకపోకలూ... వంటివన్నీ సుఖంగా సాగుతూ ఉంటాయి. మీరు అంగీకరించిన పక్షంలో పదవీ ఉన్నతి మీద మరో ప్రదేశానికి బదిలీ చేయడానిక్కూడా. పై అధికారులు సిద్ధంగా ఉన్నారనే యదార్థమూ మీకు తెలుసు. అయితే స్థాన చలనం వద్దు. నాలుగు రూపాయాలని పదవీ ఉన్నతి కారణంగా పొందగలిగినా అది ప్రస్తుత శని దశలో విడుచుకోవడమే శనికి ప్రీతికరం – మీకు లాభకరం.

ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టి రాజకీయ – చిత్ర రంగాల్లోకి నెట్టే ప్రయత్నం చేయవచ్చు. వారి లాభమే వారు చేస్తున్న ప్రోత్సాహానిక్కారణం. కచ్చితంగా చెప్పడం మంచిది – రానే రానని. మొగమాటపడితే పాతాళం లోతు ఎంతో మీరు అనుభవపూర్వకంగా అందరికీ చెప్పగలుగుతారు.

లౌకిక పరిహారం: ఒకరి ఒత్తిళ్లకి లోబడకండి. కష్టాన్ని సహించండి. వ్యతిరేకత ఉండదు.
అలౌకిక పరిహారం: శని శ్లోకాన్ని రోజుకి 361 మార్లు చదవడం తప్పనిసరి.


ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

రాముడు శ్రీమద్రామాయణంలో వాపోయాడు. రాజ్యం నుండి వెళ్లగొట్టబడ్డాను. పోనీ అయోధ్య పొలిమేరల్లో ఉన్నానా? దండకారణ్యానికి పోవాలనేది నియమం. భార్యతో ఉన్నాను గదా! అనుకుంటే తాపసునిగా జీవించాలనేది ఆజ్ఞ. సరే అనుకుంటూ కాలాన్ని గడుపుతూంటే సీతాహరణం... ఏమిటీ జీవితం? – అని.
భయపడకండి. దిగులు పడకండి. కష్టాలన్నీ వరసగా ఎదురుచూస్తున్నాయి. క్రమంగా ఒకటి తర్వాత ఒకటి రాబోవడానికి. మరేం చేయాలి? అనేదేగా ప్రశ్న.
మీకు సంబంధించిన విద్యార్హతల (సర్టిఫికేట్లు...) పత్రాలూ స్థలాలకి చెందిన దస్తావేజులూ... అన్నిటినీ భద్రంగా చూసుకోండి. మీరు ఉండకుండా ఉన్న స్థలాలూ ఇళ్లూ... ప్రతి వారమూ (7 రోజులకి చూసుకుంటూ ఉండాల్సిందే! పిల్లల్ని చరవాణి (సెల్‌)లో ఏం మాట్లాడుతున్నారో తప్పక గమనించండి – గమనిస్తూ ఉండండి. ఇదంతా లౌకిక ప్రయత్నమే.

నిత్యం శనిపూజని చేస్తూ ఉండండి. ఆయనని రోజుకోమారు తల్చుకుంటూ ఉంటే – వీడు/ ఈమె నాకు భయపడ్డాడనే ఆనందంతో ఉన్న శని – మీకు అలా కష్టాన్ని కలిగించి అంతలోనే ఇబ్బందిని తొలగిస్తూ ఉంటాడు. మీకు కష్టం తీరడం లేనేలేదనిపిస్తే మీరు శనిని సరిగానూ తగినంతగానూ ఆరాధించడం లేదనే దానర్థం.
ఉద్యోగులకి మానసిక అశాంతత, ప్రయాణాల్లో వస్తు నష్టమూ ఉండే అవకాశముంది కాబట్టి తక్కువ మాట్లాడటం ఆచితూచి వ్యవహరించడం వస్తు భద్రతతో ఉండడం అవసరం. ఆర్థికంగా ఉన్న లోటు కారణంగా రుణాన్ని చేయకండి. ఎంత గుడ్డ ఉంటే అంతే అంగీ (చొక్కా) అన్నట్టు ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకుంటూ ఉండండి కొంతకాలం పాటు.

లౌకిక పరిహారం: తగినదానికి మించిన జాగ్రత్త, మోసపోతామనే భయంతో ఉండండి.
అలౌకిక పరిహారం: శని స్తోత్రాన్ని రోజూ ముమ్మారు కచ్చితంగా చదువుకుంటూ ఉండండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

మంచి రద్దీగా ఉన్న ప్రయాణీకుల వరసలో మీరెక్కడో మధ్యలో ఉంటే వెనుకవాళ్ల తోపుడు కారణంగా మీ ప్రయత్నమేమీ లేకుండా ఎలా మీరు ముందు ముందుకి వెళ్తూ సరిగ్గా వాహనంలోకి ఎక్కగలుగుతారో అలా మీ ప్రయత్నాలేమీ అక్కర్లేకుండానే – ఏడ్చాదాని మగడొస్తే.. అనే సామెతగా అన్నీ కలిసొస్తాయి. మీ పట్ల శత్రుత్వం ఉన్నవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని కలుసుకోడానికొస్తారు.

ఎంత చెడ్డా విరిగిన కాలుని వైద్యం చేసుకున్నాక సరైన కాలుగానే ఉందని మీరునుకున్నా– ఎలా అది సహజమైన కాలు కా(లే)దో అలాగే ఎంత మీకు పరిచితులే అయినా ఒకసారి శత్రుత్వమంటూ వచ్చి తిరిగి కలుసుకున్నా పైపై పెదవి చిరు (చివరి) నవ్వులే గాని హృదయపూర్వక హాసాలుండవని గమనించండి. తీర్థయాత్రల పట్ల దృష్టి మళ్లి దగ్గరే కాకుండా దూరప్రాంతాలక్కూడ వెళ్లి పుణ్యస్నానాలూ దానధర్మాలూ చేసి వచ్చే అవకాశముంది. ఆ కారణంగా మనశ్శాంతి కలగడమే కాక వివాదాల్లో ఉన్న ఆస్తిపాస్తుల తగాదాలకి ఓ చక్కని పరిష్కారం కూడ మీకు దాదాపుగా లభించినట్లే అవుతుంది.

వ్యాపారాన్ని బలం చేసుకోవడం తప్ప కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అంత సరికాదు. బంధువులొచ్చి ఎప్పటివో అయిన మాటల్ని తిరగదోడుతూ విరోధాన్ని బలం చేస్తూ గనుక మాట్లాడడం ప్రారంభిస్తే వెంటనే అక్కడి నుండి వెళ్లిపోండి లేదా మౌనంగా ఉండండి తప్ప తిరిగి సమాధానాన్ని ఈయాలని కనీసం ప్రయత్నాన్ని కూడ చేయకండి. ఈ సందర్భంలో ఎవరైనా మధ్యవర్తిగా వ్యవహరించబోతూంటే ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం, తమకి అనవసరమ’ని నిష్కర్షగా చెప్పెయ్యండి. స్త్రీలతో వివాదాలు అసలు ఉండకూడని వారం ఇది.

లౌకిక పరిహారం: మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది కాబట్టి దూకుడుతనమూ వద్దు. నిదానమూ వద్దు.
అలౌకిక పరిహారం: గణపతి షోడశనామాలని పఠించండి.


కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
లోతైన నది మీద నావలో విహరించడమేనేది ఓ మంచి అనుభవాన్నీ సంతోషాన్నీ ఓ పక్క కలగజేస్తున్నా– సుఖంగా ఒడ్డు చేరేవరకూ లోలోపల కొంత భయం తప్పనిసరిగా ఉండేటట్లు ఏ పనిని చేస్తున్నా ఓ మానసిక భీరుత్వం (పిరికితనం) ఉంటుంది. అయితే వ్యతిరేక ఫలితాలుండవు.ఆస్తులపట్ల వివాదాలున్నట్లయితే అవతలివారు ఏదో ఓ పరిష్కారానికంటూ గనుక వస్తే కొద్ది అటూ ఇటుగా వ్యవహారాన్ని పరిష్కరించేసుకోవడం ఉచితం తప్ప, ఇప్పటిక్కూడ తేల్చకుండా అలానే నానుస్తూ గాని ఉన్నట్లయితే చీడపురుగు చేరి చెరచురా వృక్షంబు – అన్నట్టు వివాదంలో పడ్డ ఆస్తి ఆ వివాదం కారణంగా మొత్తానికి మోసపోయే స్థితికి సాగిపోవచ్చు. ఉద్యోగస్థులే అయినట్లయితే అత్యాశకి పోతూ పదవీ ఉన్నతి మీద స్థానచలనాన్ని చేస్తూ – తాత్కాలికంగానే కదా అనుకుంటూ సుదూర ప్రాంతానికి వెళ్లవలసి వస్తే ‘కాద’ని నిర్భయంగా చెప్పండి తప్ప అంగీకరించి స్థానాన్ని విడిచిపెట్టేసుకోకండి.

చేస్తున్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలే గాని వహించవలసి వస్తే అంగీకరించండి తప్ప వ్యతిరేకించడం సరికాదు.
సంతానంలో ఇంకా విద్యార్థి దశలో ఉన్నవారుంటే వాళ్లకి మీరనుకున్నంత ఉత్తమఫలితాలు రావనే స్థిరమైన ఆలోచనతో ఉండండి.
నిరాశాపూర్వకంగా ఫలితాలు వచ్చినట్లయితే మీ దుఃఖాన్ని వాళ్లు గమనించేలా ప్రవర్తించండి తప్ప నోటికొచ్చినట్టు మందిలించడం ప్రస్తుతానికి వద్దు.

లౌకిక పరిహారం: ఆస్తుల్ని తరచూ చూసుకుంటూ ఉండండి. సంతానంతో జాగ్రత్తగా ప్రవర్తించండి.
అలౌకిక పరిహారం: కాలభైరవస్తోత్ర పఠనం ఉత్తమం.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

దేవాలయాలకి ఉత్సవాలు జరిగే వేళ ఓ చక్రాన్ని తిప్పుతూ ఏ అంకెమీద సొమ్ముని పందెంగా పెట్టదలిచారో చెప్పవలసిందంటూ కవ్విస్తారు. ఏదో ఓ అంకెమీద పందేన్ని పెట్టి ఆ చక్రం తిరగడం ప్రారంభమయ్యాక ఆపేంతవరకూ తీవ్ర మానసిక సంక్షోభాన్నీ ఆత్రుతనీ పొందుతారు పందెం పెట్టి వ్యక్తులు. అలాగే మీరు కూడ ఏ మాత్రమూ సరిలేదని బాగా తెలిసిన సంస్థలో పెట్టుబడిని పెట్టి స్వల్పకాలికమైన పెట్టుబడే కదా! అనుకుంటూ తీవ్ర మానసిక సంక్షోభంతో ఉంటారు.
వ్యతిరేక ఫలితం రాదుగాని గుండెమీద తీవ్రభారం తప్పదు. అతితక్కువ మూల్యంతో వాహనాన్ని కొనుక్కోగలిగే అవకాశముంది. అయితే అవసరమా? అని ఆలోచించి మాత్రమే తీసుకోండి. కళాసాహిత్య నాటక రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ వారం. అయితే ఈ గుర్తింపు కారణంగా తీరుబడి లేకుండా గడపవలసి వస్తుంది.కుటుంబసభ్యులంతా కొంత విసుగు అసహనం చిరాకు వ్యతిరేక సంభాషణలతో ఉండవచ్చు. ఎక్కువసేపు వాళ్లతో గడుపుతూన్న పక్షంలో వైద్యావసరం ఉండదు. వ్యయం అవసరం కూడ ఏర్పడదు. అనుకోకుండా ఎందరో పెద్దపెద్దలతో పరిచయాలు ఔతాయి.

అంతమాత్రాన అంతటి పలుకుబడీ హోదా మీకుందని భావించకండి. ఆ స్థాయి వ్యక్తులు మీరెలా వారికి ఉపయోగపడతారా? అనే తీరు ఆలోచనలోనే ఉంటారు తప్ప మీకు అవసరవేళలో కలిసొస్తారని భావించకండి.పైగా వాళ్ల గొప్పదనాన్ని అడ్డుపెట్టుకుని మీతో కొన్ని పనుల్ని చేయించుకుంటూ మీ సమయాన్ని పాడుచేస్తారు. రాగిలోహం బంగారంతో కలవడం మంచిది తప్ప ఇనుము కాదు.

లౌకిక పరిహారం: అత్యాశకి పోవద్దు. గుండె మీద భారాన్ని పడనివ్వద్దు.
అలౌకిక పరిహారం: నవగ్రహ ప్రదక్షిణాలని చేస్తూ ఉండండి.

డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు
జ్యోతిష్య పండితులు

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహాలక్ష్మి ముస్తాబు

దోషం ఎవరికి?

ప్రమోషన్స్‌ ఎంజాయ్‌ చేయలేను

గన్‌ టు గన్‌

వాళ్ల అంతు చూస్తా

మరో భారతీయుడు