More

ఆదిపూడి వాసుల మానవత్వం

4 Jan, 2020 12:51 IST
పోలీసుల సమక్షంలో అభిజిత్‌ను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఆదిపూడి గ్రామస్తులు

ఐదు నెలలు మతిస్థిమితం లేని యువకుడికి పోషణ

అనంతరం పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగింత

ప్రకాశం, కారంచేడు: మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి..ఇంటి నుంచి బయటకు వచ్చాడు..అలా అలా తిరుగుతూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.. గమ్యమెటో తెలియకుండానే రైలులో కూర్చొన్నాడు. అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలయకుండానే రోజులు తరబడి ప్రయాణించాడు. పశ్చిమబెంగాల్‌ నుంచి ఏపీ వరకు ప్రయాణం చేశాడు. అక్కడక్కడా తిరుగుతూ దొరికింది తింటూ కాలం వెళ్లదీస్తున్నాడు. చివరకు కారంచేడు మండలం ఆదిపూడి చేరుకున్నాడు. అతడిని అక్కున చేర్చుకున్న గ్రామానికి చెందిన ముసునూరి రమేష్‌ భోజనం పెడుతూ ఇంట్లో ఉంచుకున్నాడు. అతడికి తెలుగు రాదు. ఇక్కడ ఉన్న వారికి బెంగాళీ రాదు. దీంతో అతని చిరునామా ఎక్కడో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆదిపూడికి చెందిన బండారు సురేష్‌ సీఐగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు అభిజిత్‌ను చూసి అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ద్వారా మరికొంత మంది గ్రామస్తుల సహకారంతో పశ్చిమబెంగాల్‌లోని తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. వారికి విషయాన్ని తెలియజేశారు. కారంచేడు ఎస్‌ఐ బి.నరశింహారావు తెలిపిన వివరాలు పరిశీలిస్తే..

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన నదియా మండలం హజరాపూర్‌ గ్రామానికి చెందిన అసిన్‌మండిల్‌ కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆ తల్లిదండ్రులకు అభిజిత్‌ ఒక్కడే. అతడికి ఇప్పుడు 22 ఏళ్లు. ఎనిమిదేళ్ల క్రితం అంటే అతడికి 14 ఏళ్లు ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి రైలులో ఆంధ్రాకు చేరుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆదిపూడి వచ్చిన అతడికి అన్నం పెట్టి గ్రామస్తులు ఆదరించారు. ఎట్టకేలకు తల్లిదండ్రుల చిరునామా సేకరించారు. పశ్చిమబెంగాల్‌ నుంచి తల్లిదండ్రులను పిలిపించి శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో వారి పూర్తి వివరాలు పరిశీలించి మతిస్థిమితం లేని కుమారుడిని అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమకు అందజేసిన గ్రామస్తులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలి పా రు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వారి కి దారి ఖర్చులకు కూడా గ్రామస్తులు రూ.10 వేలు అందించి భోజన వసతి కల్పించి రైలు ఎక్కించి దగ్గరుండి వారిని సాగనంపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కారుమూడి సుబ్బారెడ్డి, చల్లా సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి.నరసింహారావు, ముసునూరి రమేష్, ఆదిపూడి గ్రామస్తులు, అభిజిత్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేడు రాజాం, కొత్తపేట నియోజకవర్గాల్లో యాత్ర 

బడుగుల కల సాకారం

నాణ్యతలేని మందులకు కళ్లెం..

మేము సైతం..

తీవ్రం కానున్న వాయుగుండం