More

భద్రం... బీ కేర్‌ ఫుల్‌!

3 May, 2022 23:51 IST

పెట్రోల్, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్న వేళ... కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం చెప్పిన జోస్యం ఓ తీపికబురు. పెట్రోలు వాహనాల కన్నా ఎలక్ట్రిక్‌ వాహ నాలు (‘ఈవీ’లు) చౌకగా లభించే రోజు ఎంతోదూరంలో లేదన్న ఆయన మాట వస్తున్న మార్పు లకు నిదర్శనం. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రపంచ కుబేరుడూ, విద్యుత్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’ అధిపతీ ఎలాన్‌ మస్క్‌కు సైతం గడ్కరీ పదే పదే బహిరంగ ఆహ్వానం పలుకుతుండడం గమనార్హం. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా కొద్ది వారాలుగా పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహ నాల పేలుళ్ళతో ‘ఈవీ’లు ఎంత వరకు సురక్షితమనే ఆందోళన కూడా పెరగడం విచిత్రమైన పరి స్థితి. తక్షణమే పాలకులు కళ్ళు తెరవకుంటే నూతన వాహన విప్లవానికి స్పీడ్‌ బ్రేకర్లు పడే దుఃస్థితి.

సాక్షాత్తూ కేంద్రమే తక్షణం స్పందించి ‘ఈవీ’ల భద్రత, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి ఇటీవల ఓ నిపుణుల సంఘాన్ని వేసింది. మరోపక్క ‘ఈవీ’ల పేలుళ్ళతో వాటిని ఉత్పత్తి చేసిన సంస్థలు ఆ యా బ్యాచ్‌ వాహనాలన్నింటినీ వెనక్కి రప్పించే పనిలో పడ్డాయి. అలా ఇప్పుడు చర్చ అంతా ‘ఈవీ’లు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, వాహనాలపై కేంద్రీకృతమైంది. తప్పు వాహనాలలో ఉందా, వాటిలో వాడే బ్యాటరీలలో ఉందా అన్నది పక్కనపెడితే, మార్చి ఆఖరులో పుణేలో, తరువాత వెల్లూరు, నిజామాబాద్, విజయవాడ సహా పలుచోట్ల విద్యుత్‌ స్కూటర్లు, ఛార్జింగ్‌ సమయంలో బ్యాటరీలు పేలిపోయాయి. అమాయకుల ప్రాణాలు పోయాయి. దీనితో ‘ఓలా ఎలక్ట్రిక్‌’ సంస్థ 1441 విద్యుత్‌ టూ వీలర్లనూ, అలాగే ‘ఒకినావా ఆటోటెక్‌’ 3 వేలు, ‘ప్యూర్‌ ఈవీ’ 2 వేలకు పైగా లోపభూయిష్ఠ వాహనాలనూ విపణి నుంచి వెనక్కి రప్పించేశాయి.


పర్యావరణానికి పెరుగుతున్న ముప్పు రీత్యా ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వైపు మొగ్గు కనిపిస్తోంది. భారత ఆటోమొబైల్‌ పరిశ్రమలో 1.8 కోట్ల ద్విచక్ర వాహనాలు, 40 లక్షల కార్లు ఉన్నాయని ఓ లెక్క. వాటితో పోలిస్తే ‘ఈవీ’లు స్వల్పమే కావచ్చు. అయితేనేం, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఈవీ’లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో 11 లక్షలకు పైగా విద్యుత్, లేదా బ్యాటరీతో నడిచే వాహనాలు రిజిస్టరైనట్టు గత నెల లెక్క. 2010 నాటితో పోలిస్తే, ‘ఈవీ’లలో వాడే లిథియమ్‌–అయాన్‌ బ్యాటరీలకయ్యే ఖర్చు 89 శాతం పడిపోయింది. ఆ ఖర్చు తగ్గడంతో, ‘ఈవీ’ల వినియోగం పెరిగింది. గత ఏడాది మార్చితో పోలిస్తే, ఈ మార్చిలో 4 రెట్లు అధికంగా 50 వేల ‘ఈవీ’ టూవీలర్లు దేశంలో అమ్ముడయ్యాయి. దానికి తగ్గట్టే, మన దేశంలోనూ స్టార్టప్‌లుగా స్థానిక తయారీ సంస్థలు పుట్టుకొచ్చాయి. పెట్రోలు వాడకం తగ్గించడానికీ, పర్యావరణ హితానికీ ‘ఈవీ’లు ఉపయుక్తమే. కానీ, కొత్త గిరాకీకి తగ్గట్టు చకచకా ఉత్పత్తి పెంచాలనే తాపత్రయంలో పడ్డ స్థానిక సంస్థల నాణ్యతా ప్రమాణాల మాటేమిటన్నది ప్రశ్న. తయారీదార్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని కేంద్ర మంత్రే అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ‘ఈవీ’ల్లో వాడే బ్యాటరీలే కీలకం గనక, వాటిలోని అంతర్గత భద్రతా అంశాల్లో రాజీ పడరాదు. ఇటీవలి ఘటనలు చెబుతున్న పాఠం అదే! 

నిజానికి, శిలాజ ఇంధనాలకు బదులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, వాటితో నడిచే వాహనాల వాడకం పెరగాలి. అందులో మరో మాట లేదు. కేంద్రం కూడా విద్యుత్‌ వాహనాల తయారీ, బ్యాటరీ రీ–ఛార్జింగ్‌ వసతులకు కేంద్రం బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రకటించింది. తాజాగా బయో ఇథనాల్, సీఎన్జీ, ఎల్‌ఎన్జీ లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి, వ్యాపారం చేసే సంస్థలకు ప్రాధాన్యతా రంగం కింద ఋణాలిచ్చి, వెసులుబాట్లు కల్పిస్తామంటూ గడ్కరీ వ్యాఖ్యానించారు. అదీ హర్షణీయమే. ఇథనాల్‌ కెలోరిఫిక్‌ విలువను పెట్రోలుకు దీటుగా తీసుకువచ్చేందుకు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐఓసీ) చేస్తున్న ప్రయోగం ఇప్పటికే విజయవంతమైందట. కాబట్టి, లీటరు పెట్రోలుతో పోలిస్తే లీటరు ఇథనాల్‌తో తక్కువ కిలోమీటర్లే ప్రయాణించగలమనే బాధ తొలగిపోయినట్టే! రానున్న రోజుల్లో ఇథనాల్‌తో నడిచే వాహనాలు సైతం మరిన్ని రావచ్చు. 

ఏమి వచ్చినా, ఎన్ని వచ్చినా మన వాతావరణానికి తగ్గట్టు అవి ఉన్నాయా, లేదా అన్నది తయారీ దశలోనే పరీక్షించడం కీలకం. భారత్‌లోని వేడి వాతావరణానికి సరిపడని, ఇట్టే పేలిపోయే, చౌకరకం చైనా ‘ఎన్‌ఎంసీ’ (నికెల్‌ – మ్యాంగనీస్‌– కోబాల్ట్‌) బ్యాటరీల వాడకం టూవీలర్ల పేలుళ్ళకు కారణమంటున్నారు. లిథియం బదులు సోడియం, జింక్, అల్యూమినియం లాంటి చౌక రకం వాటితో తయారీ యోచించాలి. బ్యాటరీ అయినా, బండి అయినా వేడెక్కగానే ఆగిపోయే టెక్నాలజీని చేర్చాలి. ఇక, ‘ఈవీ’ల వాడకం పెరిగినంతగా ఛార్జింగ్, సర్వీస్‌ స్టేషన్లు లేవు. ఇళ్ళ దగ్గర ఈ కార్లను సులభంగా ఛార్జింగ్‌ చేసుకొనే వసతుల గురించి కంపెనీలు పట్టించుకోవట్లేదు. 

పార్కింగ్‌ వసతులే కరవైన దేశంలో అపార్ట్‌మెంట్ల కామన్‌ ఏరియాల్లో ఈ కార్లకు ఛార్జింగ్‌ వసతులెలా కల్పించాలో తెలీదు. వీటికి పరిష్కారాలు వెతకాలి. ప్రభుత్వమే ‘ఈవీ’లను ప్రోత్సహి స్తున్న వేళ, జనంలో అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ఉత్పత్తిదారులతో సహా అందరికీ ఉంది. అది జరగకపోతే, ప్రత్యామ్నాయ వాహనాల వైపు మళ్ళాలనే ఆలోచనకే గండి పడుతుంది. ‘ఈవీ’లకు నాణ్యతాపరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పటికైనా చేస్తున్నందుకు సంతోషం. ఏమైనా, ‘ఈవీ’లపై సమగ్రవిధానం సత్వర అవసరం. ఎందుకంటే, వాహనాల కన్నా మనుషుల ప్రాణం ఖరీదే ఎక్కువ!  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

శతకోటి జనుల స్వప్నభంగం

పుస్తకం కర్ణభూషణం

ఆశల పల్లకిలో కాంగ్రెస్, అడ్వాంటేజ్‌ బీఆర్‌ఎస్‌!

అద్భుత యుగం... అధ్వాన్న శకం!

పనికొచ్చే చర్చలేనా?!