More

జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత

31 Jul, 2022 06:08 IST
సదస్సులో సీజేఐ రమణ, ప్రధాని మోదీ మాటామంతీ

దేశ న్యాయ వ్యవస్థకు అదే వెన్నెముక: సీజేఐ రమణ

పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలి

ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల సదస్సులో ప్రారంభోపన్యాసం

న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.

‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.

నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్‌ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు.

సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు.

నల్సా సేవలు అమోఘం
విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్‌ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్‌ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు.  న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు.

ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి.

సులువుగా న్యాయం: మోదీ
సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.

‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు.

ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు
విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘స్మార్ట్‌’ పోలింగ్‌ స్టేషన్‌ ప్రత్యేకతలేమిటంటే?

తొలిసారి.. ఇక్కడ పోలింగ్‌ భారమంతా మహిళలదే

ఆదిత్య థాక్రేపై కేసు నమోదు

వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు

ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!