More

ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి కన్నుమూత

10 Mar, 2021 02:33 IST

సుదీర్ఘకాలంపాటు ‘మిసిమి’ సంపాదక బాధ్యతలు

మనోవిజ్ఞాన శాస్త్రాలు, బౌద్ధ గ్రంథాల అనువాదకులుగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయనను ఫిబ్రవరి 20వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆయన పూర్తిస్థాయిలో కోలుకోలేదు. బుధవారం మదీనగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

ఆయనకు భార్య లక్ష్మీకాంతమ్మ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు శైలజ, ప్రమీల కొంతకాలం క్రితమే మరణించారు. తెలుగు ప్రజలకు ‘ఫ్రాయిడ్‌’ను, మనోవిజ్ఞాన శాస్త్రాలను అన్నపరెడ్డి పరిచయం చేశారు. బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించిన అరుదైన అనువాదకులుగానూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు.

1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో అన్నపరెడ్డి జన్మించారు. తూములూరులోనే ఎలిమెంటరీ విద్య, కొల్లిపరలో హైస్కూలు చదువు, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, వాల్తేరు ఆంధ్ర వర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. తెనాలిలో సోషియాలజీ లెక్చరర్‌గా ఆయన చాలా మంది విద్యార్థులను ప్రభావితం చేశారు.

బౌద్ధానికి సంబంధించిన అనేక ప్రఖ్యాత గ్రంథాలను అనువదించి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. 1991లో లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన అనంతరం 30 గ్రంథాలు రచించారు. ‘సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌’, మానవీయ బుద్ధ, చింతనాగ్ని, కొడిగట్టినవేళ, ఆచార్య నాగార్జునుడు, మేధావుల మెతకలు, బుద్ధదర్శనం (అనువాదం), ‘బుద్ధుని సూత్రసముచ్చయం’ (సుత్తనిపాతానువాదం) వీటిలో ముఖ్యమైనవి.

2000–2002 మధ్యకాలంలో కేంద్ర సాం స్కృతిక శాఖ సీనియర్‌ ఫెలోషిప్‌తో ‘తెలుగు సాహిత్యంపై బౌద్దం ప్రభావం’అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన ఫలితంగానే ‘తెలుగులో బౌద్ధం’పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. అన్నపరెడ్డి జరిపిన సాహితీ కృషికి గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మొత్తం ఓటర్లు  3.26 కోట్లు

రాబోయే వ్యాధులకు ముందే చెక్‌!

ఆగం కావొద్దు

బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే నిరుద్యోగులది అడవి బాటే 

కాంగ్రెస్‌ వస్తే.. ఆరు నెలలకో సీఎం