వీడు మాయలోడు.. కలెక్టర్‌ పీఏ నంటూ 

17 Jan, 2022 11:14 IST|Sakshi

కాంట్రాక్టర్లకు బెదిరింపులు 

బిల్లులు పాస్‌ కావాలంటే ఐదు శాతం

కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ 

గతంలో పలు కేసుల్లో నిందితుడు

పోలీసు నిఘాకు చిక్కి కటకటాలకు

కర్నూలు: ఎదుటి వ్యక్తుల అవసరాలే ఈ మోసగాడికి పెట్టుబడి. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరార్థులను చేర దీసి రూ.లక్షల్లో గుంజేశాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక కలెక్టర్‌ పీఏనంటూ కొంతమంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతని నేర చరిత్రను కర్నూలు డీఎస్పీ కెవి.మహేష్‌, మూడవ పట్టణ సీఐ తబ్రేజ్‌తో కలిసి ఆదివారం తన కార్యాలయంలో వివరించారు.

చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్‌ బంగార్రాజు..

బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన తాటికొండ పెద్దమౌలాలి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో వక్రమార్గం పట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు పాసైన కాంట్రాక్టర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి వారికి ఫోన్‌ చేసి తాను కలెక్టర్‌ పీఏనంటూ పరిచయం చేసుకునేవాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు పాస్‌ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అవి క్లియర్‌ చేయడానికి ఐదు శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు.

ఇదే తరహాలోనే ఈ నెల 12వ తేదీన తుగ్గలి ప్రాంతానికి చెందిన ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్‌ నవీన్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి తాను కలెక్టర్‌ పీఏనని పరిచయం చేసుకున్నాడు. పెండింగ్‌ బిల్లులను పాస్‌ చేయడానికి రూ.లక్ష తన అకౌంట్‌లో వేయాలని డిమాండ్‌ చేశాడు. కాంట్రాక్టర్‌ స్పందించకపోవడంతో పదేపదే ఫోన్‌ చేసి బెదిరించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కలెక్టర్‌ కార్యాలయం సిబ్బందితో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి కర్నూలు శివారులో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ మహేష్‌ వెల్లడించారు.

నిందితుడి నేరాల చిట్ట.. 
నంద్యాల ప్రాంతానికి చెందిన పేదలకు ఇళ్లు ఇప్పిస్తానని రూ. 22 లక్షలు వసూలు చేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి నకిలీ రసీదులు ఫోర్జరీ సంతకా లతో పట్టాలిచ్చి మోసం చేశాడు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు.

గడివేముల ప్రాంతానికి చెందిన కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు   పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు.

ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓ, సబ్‌–రిజి్రస్టార్‌ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసిచ్చాడన్న ఫిర్యాదు మేరకు 2018లో బండిఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.    

మరిన్ని వార్తలు