శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..

18 May, 2020 18:20 IST|Sakshi

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది 

సామాజిక బంధాలు  ప్రభావితమవుతాయి

ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి 

సాక్షి,న్యూఢిల్లీ : కరోనా కట్టడి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ఇంటినుంచే సేవలను అందిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థ దాకా ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్న సమయంలో సిబ్బంది శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే విధానాన్ని తోసి పుచ్చారు. దీని వలన ఉద్యోగుల్లో అనేక దుష్పరిణామా లుంటాయని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం ఎలా, వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రిమోట్ గా పనిచేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు.   (‘వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు’)

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగులకే ఎక్కువ ప్రమాదం వుంటుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా  ఉద్యోగులు సమాజంలో కలవలేని పరిస్థితులు వస్తాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. దీని వల్ల కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. సమావేశాల్లో పాల్గొనేటప్పుడు భౌతికంగా కలవడానికి, ఆన్‌లైన్‌లో వర్చువల్ వీడియో  కాన్ఫరెన్సుల ద్వారా కలవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. భౌతిక, వ్యక్తిగత సమావేశాల ప్రయోజనాలను ఇవి భర్తీ చేయ లేవన్నారు. అంతేకాదు అంతా రిమోట్ సెటప్ గా మారిపోవడం అంటే.. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి జారి పోవడమేనని ఆయన పేర్కొన్నారు.  (కరోనా : ట్విటర్‌ సంచలన నిర్ణయం)

కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విటర్ కూడా ముందుకొచ్చింది. ప్రధానంగా మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత కూడా తన సిబ్బందికి ఇంటినుండి 'ఎప్పటికీ' పనిచేసుకోవచ్చనే అవకాశాన్ని ట్విటర్ ప్రకటించిన తరువాత సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అక్టోబర్ వరకు పొడిగించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు