ఎంగేజ్‌మెంట్‌ ఒకరితో..ప్రేమ మరొకరితో

29 Nov, 2019 13:07 IST|Sakshi

ఈరోజు నా మనసులో ఉన్న బాధ ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటున్నా. నాకు మా మామయ్య కూతురితో 2014లో ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఆరు నెలల తర్వాత అమృత (పేరు మార్చాం) నాకు   పరిచయమైంది. చాలా బావుండేది. అప్పుడప్పుడు సరదాగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. క్రమంగా తను నాకు చాలా దగ్గరైంది. అన్ని విషయాలు నాతో పంచుకునేది. చిన్నప్పటి నుంచి తను పడిన బాధలు, కష్టాలు అన్నీ చెప్పేది. తను జీవితంలో ఇది వరకే మోసపోయింది. ఇప్పుడు మళ్లీ నావళ్ల తను మోసపోకూడదనుకున్నా. మనసులో ఎక్కడో చిన్న తప్పు చేస్తున్నాననే బాధ నన్ను వెంటాడేది. ఒక పక్క మామయ్య కూతురితో ఎంగేజ్‌మెంట్‌, మరోపక్క అమృతతో ప్రేమ. ఈ సంఘర్షణల మధ్య చాలా నలిగిపోయేవాడిని. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి.

మామయ్య ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. నా కన్నా మంచి అబ్బాయితో తన కూతురికి పెళ్లి జరిపించగలడు. కానీ ఇలా చేస్తే..మా ఇరు కుటంబాల మధ్య సంబంధాలు ఏమవుతాయి? నా వల్ల రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందా? వీటన్నింటికి నా దగ్గర సమాధానం లేదు. కానీ అమృతని మోసం చేసి తన జీవితం మళ్లీ చీకటి చేయకూడదని అనుక్నునా. ఈలోపే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మా కుటుంబాల్లో చర్చలు మొదలయ్యాయి. తన కూతురి పెళ్లి ఎంత ఘనంగా చేయాలా అని  ఆరాటపడుతున్న ఆ తండ్ని కలల్ని ఇంకా ఛిద్రం చేయకూడదని.. నా ప్రేమ గురించి చెప్పాను. ఒక్కసారిగా ఇరు కుటుంబాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. అమ్మ ద్వారా మా మామయ్య కూతురికి క్షమాపణలు చెప్పాను. మామయ్యకి మొహం చూపించలేక ఇల్లు వదిలి వెళ్లిపోయాను.  నావళ్ల తన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఊహించగలను. అందుకే తన పెళ్లి జరిగేవరకు నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా.

తర్వాత ఆరు నెలలకి మా మామయ్య కూతురికి పెళ్లి జరిగింది. ప్రస్తుతం నేను అమృతని పెళ్లి చేసుకొని ఆనందంగానే ఉన్నాను. కానీ నన్ను నమ్మిన అమ్మాయిని మోసం చేసాననే బాధ ఇ‍ప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్న బంధం..నేను చేసిన ఒక తప్పుతో తెగిపోయింది. ఇప్పటివరకు మా మామయ్య కూతురికి ఎదురుపడి క్షమించమని అడగలేదు. అడిగేంత ధైర్యం కూడా లేదు. కానీ నన్ను మన్నించు అని  ప్రతీరోజూ పశ్చాత్తాపంతో బాధపడుతూనే ఉన్నా...

- అలీఖాన్‌

మరిన్ని వార్తలు