అతడు.. డైమండ్‌ బ్రాస్‌లెట్‌ తిరిగిచ్చేశాడు

22 Apr, 2019 16:12 IST|Sakshi

చండీగఢ్‌ : చిన్న వస్తువు పోతేనే తిరిగి చేతికి రాని రోజుల్లో ఏకంగా లక్షలు విలువ చేసే డైమండ్‌ బ్రాస్‌లెట్‌ను తిరిగి సొంతదారుకు అప్పగించిన సెక్యూరిటీ గార్డు ఉదంతం వెలుగు చూసింది. చండీగఢ్‌లోని సెక్టార్‌ 17లో సినీపొలిస్‌లో సినిమా చూసేందుకు వచ్చిన మీనాక్షి గుప్తా తన భర్త పెళ్లిరోజు కానుకగా తనకు ఇచ్చిన డైమండ్‌ బ్రాస్‌లెట్‌ను పోగొట్టుకున్నారు. ఈ బ్రాస్‌లెట్‌ సెక్యూరిటీ గార్డు చేతికి చిక్కినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన అతనికి ఎంతమాత్రం కలగకపోవడంతో పాటు అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతనే లక్షల ఖరీదు చేసే ఆభరణాన్ని ఆమెకు అప్పగించాడు.

డైమండ్‌ బ్రాస్‌లెట్‌పై ఆశలు వదులుకున్నాకే తాను థియేటర్‌కు తిరిగి వచ్చి సెక్యూరిటీ గార్డును అడిగానని, ఆశ్చర్యంగా దాన్ని అతను తనకు తిరిగి ఇచ్చేశాడని మీనాక్షి గుప్తా చెప్పుకొచ్చారు. గత ఏడు నెలలుగా మూవీ హాల్‌లో పనిచేస్తున్న సూరజ్‌ నిజాయితీగా తనకు దొరికిన విలువైన వస్తువును తన జేబులో వేసుకోకుండా తిరిగి సొంతదారుకు అప్పగించడం అందరినీ ఆకట్టుకుంది. మీనాక్షి గుప్తాకు వస్తువును తిరిగి ఇచ్చే ముందు ఫోటోలు, బిల్లు, ఆమె ఆధార్‌ కార్డు సహా అన్ని వివరాలనూ పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే వస్తువును తిరిగివ్వడం గమనార్హం. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆనందం ఉంటుందని, ఇతర మార్గాల్లో సమకూరిన సొమ్ము ఎప్పుడైనా చేజారుతుందని చెబుతున్న సెక్యూరిటీ గార్డు నిజాయితీకి అందరూ హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు