తపాలా బీమాతో ధీమా

16 Apr, 2019 07:20 IST|Sakshi

ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనాలు

పిల్లల కోసం ప్రత్యేక పాలసీలు

సాక్షి, సిటీబ్యూరో:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తపాలా జీవిత బీమా భరోసా కల్పిస్తోంది. ఉద్యోగుల కోసమే పలు పాలసీలను తపాలా శాఖ గత సంవత్సరమే ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు కూడా తపాలా జీవిత బీమా పొందే సౌకర్యం ఉంది. మిగతా ఇన్సూరెన్స్‌ సంస్థల కంటే తపాలాలో బీమా చేసి అదనపు బోనస్‌లు పొందవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులు ఎక్కువగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్సు కార్పొరేషన్‌ (పీఎల్‌ఐసీ) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీలో 19 నుంచి 55 ఏళ్లు ఉన్న వ్యక్తులు వివిధ రకాల పరిమితుల ఆధారంగా పాలసీ పొందవచ్చు.

చిల్డ్రన్స్‌ కోసం..
తపాలా శాఖ జీవితాంతపు పాలసీగాని, ఎండోమెంట్‌ పాలసీ గాని కలిగిన తల్లిదండ్రుల మొత్తం పిల్లలు కూడా జీవిత బీమా పొందవచ్చు. ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం ఉంది. ఇందులో ముఖ్య పాలసీదారుడి వయస్సు 45 ఏళ్లకు మించరాదు.

సురక్ష పాలసీ..
పాలసీదారుడి వయసు 19 నుంచి 55 ఏళ్లు ఉండాలి. పాలసీ మొత్తం విలువను పాలసీదారుడి వయసు 80 ఏళ్లు నిండిన తర్వాత గాని లేదా పాలసీదారుడి తదనంతరం వారు నిర్దేశించిన వారసులు గాని, ఆయన సూచించిన సంస్థకు ఇస్తారు.  

సుమంగళ్‌..
పాలసీదారుడి వయసు 19 నుంచి 45 మధ్య ఉండాలి. కాల పరిమితి 15 లేదా 20 ఏళ్లు. పాలసీదారుడి నుంచి దరఖాస్తు అందగానే నిర్దేశించిన వాయిదా మొత్తం చెల్లిస్తారు. వాయిదా మొత్తం చెల్లించిన అనంతరం కూడా పాలసీ కాల పరిమితి అయ్యే వరకు పాలసీ మొత్తానికి జీవిత రక్షణ ఉంటుంది. ఈ పథకంలో పాలసీపై రుణాలు, పాలసీ సరెండర్‌ చేసే సదుపాయం ఉండదు.

సువిధ..
పాలసీదారుడి వయస్సు 19 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి. మొదటి ఐదేళ్ల వరకు తక్కువగా నిర్దేశించిన ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత పాలసీదారుడు జీవితాంతపు పాలసీని నిర్దేశించిన వయసుకు అంటే.. 50, 55, 58, 60 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ అయ్యే ఎండోమెంట్‌ పాలసీగా మార్పునకు సదుపాయం కలదు. ఆ విధంగా మార్చుకుంటే మొదటి ఐదేళ్లు నిర్దేశించిన ప్రీమియం యథావిధిగా 60 సంవత్సరాలు వరకు చెల్లించాలి.

యుగళ్‌ సురక్ష..
పాలసీదారుడి వయసు 21– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కాలపరిమితి ఐదు నుంచి పదేళ్ల వరకు ఈ పాలసీని ఆమోదించిన తేదీ నుంచి పాలసీదారుడు దంపతులకు ఒకే ప్రీమియంతో పూర్తి బీమా జమ చేసిన మొత్తానికి బోనస్‌ సొమ్ము కలిపి బతికి ఉన్న వ్యక్తికి ఇస్తారు. పాలసీ పొందిన వ్యక్తి భాగస్వామి ఉద్యోగి కావాల్సిన అవసరం లేదు.

సంతోష్‌ పాలసీ..
పాలసీదారుడి వయస్సు 19– 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రీమియందారుడు ఎంపిక చేసుకున్న వయసు నాటికి పాలసీ మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. 

మరిన్ని వార్తలు