వానమ్మ.. రావమ్మా..

13 Jun, 2019 12:27 IST|Sakshi
దుక్కిదున్నుతున్న రైతులు

సాక్షి, ఆదిలాబాద్‌: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం  ఆదిలాబాద్‌  రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడడమే తప్పా.. పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీంతో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

అప్పటికి.. ఇప్పటికీ
గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది.

అంతా రెడీ..
వర్షాకాలం మొదలుకావడంతో పంటలు వేయడానికి  రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. 

కష్టాల్లో కర్షకుడు
ఏటా ప్రకృతి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీశాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవాటైంది. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన సమయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. 

తీవ్ర వర్షాభావం
గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌ రూరల్, మావల, జైనథ్‌ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు.

జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్‌హత్నూర్, బోథ్‌ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్‌ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. 

మరిన్ని వార్తలు