రైతులకు అండగా..

17 Jan, 2018 07:51 IST|Sakshi

మార్చి 11న పట్టాపాస్‌బుక్‌లు పంపిణీ

‘ధరణి’ వెబ్‌సైట్‌లో భూ వివరాలు నమోదు

రైతు సమన్వయ సమితుల పాత్ర కీలకం

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అవకాశం

వివాదాలు లేకుండా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు

రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు మండలాల్లోనూ రిజిస్ట్రేషన్‌లు

కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి,ఆదిలాబాద్‌: రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ దివ్యదేవరాజన్, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారంపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాపాస్‌బుక్‌ల పంపిణీ, పంట పెట్టుబడి, 24 గంటల విద్యుత్‌ సరఫరా, పంచాయతీ ఎన్నికలు, పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టానికి సవరణ, గొర్రెల పంపిణీ, మండల కార్యాలయాల నుంచి రిజిస్ట్రేషన్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు సాయంత్రం 7గంటల వరకు కొనసాగింది.  

పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో అందరి భాగస్వామ్యం..
భూరికార్డుల ప్రక్షాళనలో వివాదం లేని భూములకు సంబంధించి పార్ట్‌–ఏ పూర్తయినందున వ్యవసాయ భూములకు ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న పట్టాపాస్‌బుక్‌లను మార్చి 11న ఒకేసారి పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మండలానికి ఒక నోడల్‌ అధికారిని ఈ ప్రక్రియ పరిశీలనకు నియమించాలని కలెక్టర్లకు చెప్పారు. పాస్‌బుక్‌లు ఒకరోజు ముందు, లేనిపక్షంలో అదేరోజు గ్రామానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు అందరు భాగస్వాములై కార్యక్రమాన్ని ప్రహసనంగా నిర్వహించాలని తెలిపారు. భూరికార్డుల నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ‘ధరిణి’ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. మార్చి 12 వరకు ‘ధరిణి’ వెబ్‌సైట్‌లో పూర్తి భూ వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. అమ్మకం, కొనుగోలుదారుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్‌ చేస్తుండాలని తెలిపారు. ఇందుకోసం మండలాల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేపట్టాలని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అదనంగా మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు. మండలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం హైపవర్‌ కంప్యూటర్లు, అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.  

ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు..
ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది మానసికంగా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీలను ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక సరిహద్దుల నిర్ధారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని, సర్వే నంబర్లు వేర్వేరు గ్రామాలకు వేర్వేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 25లోగా ఈ చర్యలను పూర్తి చేయాలన్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం విషయంలో కొత్తగా వచ్చే సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, వందశాతం పన్నుల వసూళ్ల విషయంలో గ్రామపంచాయతీలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతను సర్పంచులకు తెలియజేయాలని సూచించారు. గ్రామ జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు అందజేస్తామని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తమ అభిప్రాయాలను ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి మెయిల్‌ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్‌ చట్టానికి కూడా సవరణ చేసే అవకాశం ఉందని తెలిపారు.

రైతు సమన్వయ సమితీల బాధ్యత..
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. పంటలను మార్కెట్లకు తెచ్చేందుకు, అమ్ముకునేందుకు రైతులకు సమన్వయ సమితీలు సహకారం అందిస్తాయని, మద్దతు ధర దక్కేలా చూస్తాయని పేర్కొన్నారు. పంట పెట్టుబడి పథకాన్ని కేంద్రం ప్రశంసిస్తుందని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా ద్వారా పూర్తిస్థాయిలో మేలు చేయడం జరిగిందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను నివారించడం ద్వారా రైతుకు పంటల విషయంలో న్యాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పంట కాలనీలు ఏర్పాటు చేయడంలో రైతు సమితీలు కీలకంగా వ్యవహరించాయని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు