అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

27 May, 2018 07:34 IST|Sakshi

సిరికొండ(బోథ్‌): అప్పులు పెరిగిపోవడం..రైతుబంధు సాయం రాకపోవడంతో మనస్థాపం చెందిన సిరికొండ మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన రైతు గోగుల నారాయణ (56) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ తనకున్న రెండెకరాల పరంపోగు భూమితోపాటు మరింత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సక్రమంగా పంటలు పండకపోవడం, తనకున్న ముగ్గురు కూతుర్ల వివాహాలు చేయడంతో అప్పులు అధికమయ్యాయి. అవి ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్థాపానికి గురయ్యేవాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడం, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న పెట్టుబడి సహాయం చిల్లిగవ్వ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీసి చూడగా నారాయణ మృతిచెంది ఉన్నాడు. నారాయణకు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు