ఇందిరమ్మ.. ఇదేందమ్మా!

23 Feb, 2018 15:39 IST|Sakshi
అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు

నేటికీ అందని బిల్లులు

అర్ధంతరంగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలు

ఆందోళనలో లబ్ధిదారులు

కెరమెరి : నిలువ నీడ లేని నిరుపేదలకు 2005లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట గృహాలు మంజూరు చేసింది. కానీ నిర్మించిన వాటికి బిల్లులు రాక అవి అర్ధంతరంగా నిలిచిపోయాయి. అయినా వాటి గురించి పట్టించుకునే వారు కరువైయ్యారు. మండలంలోని సాంగ్వి గ్రామ పంచాయతీలోని రావుజిగూడలో 20 ఇళ్లు మంజూరు అయ్యాయి. వారిలో సుమారు 15 ఇళ్లు కిటికి లెవల్‌ వరకు పూర్తయ్యాయి. అనంతరం ఆ గ్రామం నుంచి ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు ఇతర గ్రామానికి వెళ్లి పోయారు. పోతూపోతూ ఉన్న ఇళ్లను కూడా కూలగొట్టి వెళ్లి పోవడంతో ప్రజా ధనం వృథా అయింది. అందులో మిగిలిన 5 ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు రాక అలాగే నిర్మాణాలు నిలిచిపోయాయి. అందులో మూడు బేస్‌మిట్‌ లెవల్‌ వరకు ఉండగా. మరో రెండు స్లాబ్‌ లేవల్‌ వరకు నిర్మాణాలు జరిగాయి. నేటికైనా బిల్లులు అందవా? అంటూ లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే కర్పెతగూడలో కూడా నాలుగు ఇళ్లు, కుప్పగూడలో ఐదు, లైన్‌పటార్‌లో ఎనిమిది ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు.

ప్రభుత్వంపై ఆశలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో మహిళా సంఘాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అర్ధంతరంగా నిర్మాణాలు ఆగి ఉన్న వాటి గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మాపై కరుణించక పోదా అన్న భ్రమలో ఇప్పటికీ లబ్ధిదారులు ఉన్నారు. డబ్బుల్‌ బెడ్‌ రూం కోసం మమ్మల్ని ఇంత వరకు ఎవరూ అడగలేదని, ఇక అవి కూడా మంజూరు అయ్యే అవకాశం కూడా కనబడడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

డబ్బుల్లేక నిర్మాణం ఆగింది
నేను పేద కుటుంబానికి చెందిన వాడను. నా వద్ద ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు లేక పోవడంతో ఇంటి నిర్మిణం ఆగింది. ఇందిరమ్మ బిల్లులు వస్తయి అనుకుంటే పదేళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 
– కోట్నాక్‌ జైవంత్‌రావు

ప్రభుత్వం పట్టించుకోవాలి
ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం పేదలపై దయ చూపాలి. మా గ్రామంలో నిలిచిన ఇందిరమ్మ గృహాలకు ఎంతో కొంత రుణాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి దోహదపడాలి. పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం సహకారం అందించాలి.    
– కోట్నాక్‌ బార్ఖిరావు, గ్రామ పటేల్‌

‘డబుల్‌’ మంజూరు చేయాలి
గతంలో నిర్మాణం చేపట్టేటప్పుడు బిల్లు రాక అర్ధంతరంగా నిలిచిన ఇందిమరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు చేయాలి. లేదా కొత్తగా ప్రభుత్వం పేదలకు ఇస్తున్న డబ్బుల్‌ బెడ్‌ రూం ఇళ్లనైనా మంజూరు చేయాలి. – పెందోర్‌ లింబారావు

Read latest Adilabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు