ఆదివాసీ ఆణిముత్యం.. కన్నీబాయి

8 Mar, 2019 14:44 IST|Sakshi
ఆదివాసీలకు ఎడ్లు అందజేస్తూ..

సాక్షి, కెరమెరి (ఆసిఫాబాద్‌): కెరమెరి మండలంలోని భీమన్‌గోంది గ్రామానికి చెందిన కన్నీబాయి ధైర్యానికి చిరునామాగా స్థానికులకు సుపరిచితమే! పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన ఆమె ఇంటర్‌ కెరమెరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోయినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆమెను చైతన్యపథాన నడిపించాయి. ఇందిరాక్రాంతి పథంలో పీవోపీ సీఏగా చేసిన కన్నీబాయి మండలంలోని చాలా గ్రామాలు సందర్శించి, అత్యంత వెనకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించింది. మండలంలో 108 అత్యంత వెనకబడిన కుటుంబాలు ఉన్నాయని అధికారులకు నివేదిక పంపించిన ఆమె ప్రస్తుతం వారి అభ్యున్నతికే పాటుపడుతోంది.

కన్నీబాయి ఆదివాసీ గిరిజన సంఘంలో మహిళా కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణణ్‌తో మాట్లాడి ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల 150 మంది ఆదివాసీలకు అటవీ హక్కు పత్రాలను ఇప్పించింది. తిర్యాణి మండలం చాపిడి కొలాంగూడ గ్రామానికి చెందిన కొలాం విద్యార్థిని ఆసిఫాబాద్‌లోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతూ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కన్నీబాయి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెందిందని, మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి రూ.2.5 లక్షల సాయం అందించడంలో కీలకపాత్ర పోషించింది.

అదేవిధంగా లైన్‌పటార్‌ గ్రామంలో రక్త పరీక్షల నిమిత్తం వెళ్లిన కన్నీబాయి అక్కడి ఆదివాసీ రైతుల పరిస్థితిపై చలించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య సహకారంతో ఆ రైతులకు 17 జతల ఎడ్లను ఇప్పించింది. ఇవేకాకుండా, బిత్తిరి సత్తి నటిస్తున్న ‘తుపాకి రాముడు’ సినిమాకు కన్నీబాయి కొరియోగ్రాపర్‌గా పని చేస్తోంది. రెజ్లింగ్‌లోనూ ఆమెకు ప్రావీణ్యముండటం విశేషం. విశాఖపట్టణంలో జనవరి 11 నుంచి 14 వరకు కొనసాగిన రెజ్లింగ్‌ పోటీల్లో 18 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా కన్నీబాయి రెండోస్థానం సాధించింది.

అరకులోని కటక జలపాతంలో 400 మీటర్ల అడుగులో 2.35 నిమిషాల్లో చేరి అందరినీ ఆశ్చర్యపర్చింది. నెహ్రూ యువ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు అక్కడి అధికారులు ఆమెలోని ప్రతిభను గుర్తించి పారాచూట్‌ శిక్షణ ఇప్పించారు. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్‌లోని కుంటాల జలపాతంలో ఉన్న పెద్దపెద్ద గుట్టలను అలవోకగా ఎక్కేసింది. రెండేళ్లుగా కన్నీబాయి సేవలను గుర్తించిన కుమురంభీం జిల్లా కలెక్టర్‌ చంపాలాల్, అటవీ శాఖా మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవకురాలిగా అవార్డు అందజేశారు.

మరిన్ని వార్తలు