మట్కా మాయ.. 

4 Jan, 2018 15:38 IST|Sakshi

 జిల్లాలో జోరుగా దందా  

కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న వైనం 

రోడ్డున పడుతున్న కుటుంబాలు 

ఏడాదిలో 109 కేసులు నమోదు  

రూ.1.82 లక్షల నగదు స్వాధీనం  

ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు  

ఆదిలాబాద్‌: జిల్లాల్లో మట్కాదందా జోరుగా సాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మట్కా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చిన్నాచితక నిర్వహకులే అరెస్టు కాగా, వారి వెనక ఉన్న బడా నిర్వాహకులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. జిల్లా కేంద్రంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ మట్కా, పేకాట దందాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా సగటు మనిషి జీవితాన్ని మట్కా దందా నాశనం చేస్తోంది. వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత మట్కాకు బానిసై డబ్బులు పొగొట్టుకోవడమే కాకుండా తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. కూలీలు దినమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణభారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు.. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగుల వరకు మట్కాలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.  

జిల్లాలో.. 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత కూడా మట్కాజూదం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఈ మట్కా ఎక్కువగా సాగుతోంది. మహారాష్ట్రకు అనుకొని ఉన్న బేల, జైనథ్‌ మండలాల్లో కూడా మట్కా దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఏటా కోట్లాది రూపాయాలు మట్కాతో చేతులు మారుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబాయి ప్రధాన కేంద్రంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కళ్యాణి, మిలాన్, ముంబాయి, రాజధాని వంటి కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీల్లో జిల్లాకు చెందిన వారు కూడా పాల్గొంటున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్‌ నంబర్లపై బ్రాకెట్‌ నంబర్‌కు పదిరేట్లు చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్‌ ఉంటుంది.  మనం ఎంపిక చేసిన నంబర్‌కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలేవారు తక్కువ శాతం.. డబ్బులు పోగొట్టుకునే వారే అధికంగా ఉంటారు. అయితే మట్కా ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కార్మికులు, ఉద్యోగులు, నాయకులు అనే తేడా లేకుండా ధనార్జనే ధ్యేయంగా మట్కా దందా సాగిస్తున్నారు.  

పట్టణంలో జోరుగా.. 
జిల్లా కేంద్రంలో మట్కా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కార్మిక వాడల్లో ఎక్కువ సాగుతోంది. ఖానాపూర్, జిన్నింగ్‌ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, పట్టణంలోని తాంసి బస్టాండ్, ఇటీవల స్థానిక ప్రధాన బస్టాండ్‌ వద్ద గల ఆటోల్లో సైతం మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ ఆటోలు పెట్టుకొని మట్కా నిర్వహిస్తున్నారు. అప్పడుప్పుడు దాడులు చేసే పోలీసులు పూర్తిస్థాయి నిఘా పెట్టకపోవడంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడులతో పలువురు సెల్‌ఫోన్‌ మట్కాకు తెరదీశారు. ఒకప్పుడు చిట్టీలపై నంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో విచ్చలవిడిగా సాగుతోంది. చిట్టీలతో కాకుండా సెల్‌ఫోన్‌ మెసేజ్‌లతో మట్కా ఆడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో లక్షల్లో జరిగే ఈదందా ప్రస్తుతం కోట్ల రూపాయల్లో సాగుతోంది. 

మట్కా నిర్మూలనకు కృషి 
జిల్లాలో మట్కా నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. మట్కా కేంద్రాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మట్కా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైనా మట్కా, పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గతేడాది 109 కేసులు నమోదు చేసి రూ.1,82,360 నగదును స్వాధీనం చేసుకున్నాం. అలాగే 142 మందిని అరెస్టు చేశాం.

– నర్సింహారెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ   

>
మరిన్ని వార్తలు