‘ఆగం’ జేస్తున్న ప్లాస్టిక్‌

13 Jun, 2019 10:53 IST|Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌:  ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆయన ఇప్పుడుంటే ఏ వీధి తిరిగి చూసినా ఏమున్నది ప్లాస్టిక్‌ భూతం అనే వారేమో!! అలా తయారైంది నేటి పర్యావరణం, ప్లాస్టిక్‌ వాడకం. ప్లాస్టిక్‌ వల్ల జీవరాశులు ఆగం అవుతున్నాయి. అయినా అదేమీ పట్టించుకోని మానవులు విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ని వాడుతున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా గానీ వినియోగం తగ్గడం లేదు.కూరగాయల దగ్గరనుంచి ఖరీదైన వస్తువుల వరకు తీసుకెళ్లడానికి ప్లాస్టిక్‌ బ్యాగులనే ఆశ్రయిస్తున్నారు ప్రజలు.  
నగరంలో వాడకం.. 
పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలిథిన్‌ సంచుల వాడకం పెరిగింది. కవర్లను వాడిన తర్వాత ఇష్టారాజ్యంగా రోడ్లపై వేస్తుండటంతో అవి మురుగు కాల్వల్లో పడి మురుగు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. పారిశుధ్య సమస్య ఉత్పన్నమవడానికి ఇదీ ఒక కారణమవుతోంది. ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం ఉన్నా దుకాణాల్లో ఇష్టానుసారంగా పాలిథిన్‌ కవర్లను విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌పై ఉన్న నిషేధాన్ని  ప్రజలు, దుకాణదారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. 
అధికారుల అలసత్వం... 
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు.ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. బహిరంగంగానే నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై సంబంధిత అధికారుల దాడులు కరువయ్యాయని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు