మట్కా నిర్వహకులను పట్టించిన వాట్సాప్‌

19 Jan, 2018 06:47 IST|Sakshi

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌ కాలనీలో మట్కా నిర్వహిస్తున్న మహ్మద్‌ తబ్రేజ్, ఖుర్షిద్‌ అహ్మద్‌ను గురువారం టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ వాట్సాప్‌లో సమాచారం అందించడంతో టూటౌన్‌ ఎస్సై రమణరావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఖుర్షిద్‌నగర్‌ కాలనీకి చెందిన మట్కా ఏజెంట్‌ మహ్మద్‌ తబ్రేజ్‌ అతని తండ్రి ఖుర్షిద్‌ అహ్మద్‌తో కలిసి పలువురి వద్ద నగదు తీసుకొని మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసు వాట్సాప్‌ నంబర్‌ 8333986898కు స్థానికులు సమాచారం అందించినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీ ఎస్‌ , టూటౌన్‌ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఖుర్షిద్‌ను తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశామని, తబ్రేజ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.3,250 నగదు, సెల్‌ఫోన్, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్‌ ఎస్సై రమణ, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సిరాజ్‌ఖాన్,సిబ్బంది మంగల్‌సింగ జాకీర్‌ ఉన్నారు.  

నిషేధిత తంబాకు స్వాధీనం..
జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశాల మేరకు స్థానిక చిల్కూరి లక్ష్మీనగర్‌ కాలనీలో గల రెండు గోదాములపై దాడులు నిర్వహించి నిషేధిత బోరితంబాకు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. కాలనీకి చెందిన షేక్‌ అయుబ్‌ మహారాష్ట్రాలోని పాండ్రకావడ నుంచి నిషేధిత బోరి తంబాకు తరలించి జిల్లాలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న తంబాకు విలువ రూ.96 వేలు ఉంటుందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు