రుణాలు కొందరికే..!

20 Jan, 2018 07:20 IST|Sakshi

స్వయం ఉపాధికి వేలల్లో దరఖాస్తులు

ఫెడరేషన్లకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు

మరిన్ని మంజూరు చేయాలంటున్న ఫెడరేషన్‌ సభ్యులు

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేసింది. వేలల్లో దరఖాస్తులు రాగా.. నిధులు అంతంత మాత్రంగానే విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబర్‌ మాసం వరకు 139 వివిధ సొసైటీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్‌ల కోసం వివిధ రకాల రుణాలు అందించేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసింది.  

ఫెడరేషన్‌లు ఇవే..
జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఫెడరేషన్‌లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతోపాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో 139 సొసైటీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఇందులో వాషర్‌మెన్, కోఆపరేటీవ్‌ సొసైటీ, నాయీబ్రాహ్మణ సొసైటీ, వడ్డర సొసైటీ, సాగర(ఉప్పర), వాల్మీకి, బోయ, క్రిష్ణబలిజపోసాల, బట్రాజ్, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన, నూర్‌బాషా, మేదర, టాడిటాపర్స్‌ కోఆపరేటీవ్‌ సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయా ఫెడరేషన్లకు సబ్సిడీపై రుణాలను అందజేయనుంది. వ్యక్తిగత రుణాలు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు బ్యాంక్‌తో సంబంధం లేకుండా అందజేయనుంది. సొసైటీలకు బ్యాంక్‌ లింకేజీతో రుణాలను అందజేయనుంది. ఆయా రుణాలు కోసం 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు నిండి ఉన్నవారికి వీటిని అందజేయడం జరుగుతుంది.

వేలల్లో దరఖాస్తులు..
రాష్ట్ర ప్రభుత్వం ఫెడరేషన్లతోపాటు వ్యక్తిగత రుణాలను కలుపుకొని రూ.250 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వేలాది సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో కొంతమందికే రుణం అందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు పెంచి ఇతరులకు సైతం అవకాశం కలిగేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు