పల్లెకు రాని బస్సు

24 Jan, 2018 15:13 IST|Sakshi

రోడ్డు సౌకర్యమున్నా నడవని వైనం

విన్నవించినా పట్టని అధికారులు

ఆదిలాబాద్‌రూరల్‌ : ఆర్టీసీ బస్సు చేరని గ్రామాలు ఈ రోజుల్లో కూడా అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామానికి బస్సు నడిపించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.  రోడ్డు మార్గం ఉన్న గ్రామాలకు బస్సు నడపడంలో ఆసక్తి కనబర్చడం లేదు. బస్సు నడపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని ఖండాల గ్రామ పరిధిలో సుమారు 18 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. రోడ్డు వేసి ఏడాదవుతున్నా ఆ గ్రామాలకు నేటికి బస్సు సౌకర్యం  లేదు. 

కాలినడకనే శరణ్యం...

మండంలంలోని పలు మారమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పదుల కిలో మీటర్ల చొప్పున కాలినడకన వస్తున్నారు. జిల్లా కేంద్రానికి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఆర్టీసీ బస్సు నడవకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌ వాహనాల్లో రాకపోకలు నిర్వహించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లోనైతే నానా అవస్థలు పడావల్సిన పరిస్థితి  ఉందని ప్రయాణీకులు వాపోతున్నారు.

నేటికీ బస్సు రాని గ్రామాలు...

మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ నుంచి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ఖండాల పంచాయతీ పరిధిలోని సుమారు 14 గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బీటీ రోడ్డు సౌకర్యం కల్పించింది. బీటీ రోడ్డు మార్గం వేసి సుమారు ఏడాది గడుస్తున్నా రాజుగూడ, పోతగూడ–1, పోతగూడ–2, ఖండాల తండా, ఖండాల గూడ, ధర్‌లొద్దీ, మొలాలగుట్ట–1, మొలాల గుట్ట–2, లోహర, జాంగూడ, ఎస్సీ గూడ, చిలాటీగూడ, సాలాయిగూడ, శివగూడ గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్న బస్సు మాత్రం వెళ్లడం లేదు. ప్రయాణీకులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ గ్రామాల్లన్నీ ఒకే రోడ్డు మార్గంలో ఉన్నాయి. అధికారులు స్పందించి బస్సును నడిపించేలా చూడాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరతున్నారు.

ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తున్నాం
తమ గ్రామాలకు వెళ్లేందుకు బీటీ రోడ్డు వేసిన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో ప్రైవేట్‌ వాహనాలు ఆటోలు, జీపుల్లో రాకపోకలను నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయాల్లోనైతే ఆ వాహనాలు రాకపోవడంతో కాలినడకన రాకపోకలు నిర్వహిస్తున్నాం. అధికారులు స్పందించి బస్సు నడిపిస్తే బాగుంటుంది.
- నైతం శంభు, ఖండాల, ఆదిలాబాద్‌

ఆఫీసర్‌లకు చెప్పిండ్రాట
తమ గ్రామానికి రాకపోకలు నిర్వహిచేందుకు గవర్నమెంట్‌ రోడ్డు వేసింది. కానీ బస్సు మాత్రం రావడం లేదు. మా ఊళ్లకు బస్సు నడపాలని మా ఊరోళ్లు ఆఫీసర్‌లకు చెప్పిండ్రాటా. కానీ ఇంత వరకు బస్సు నడవడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– కనక రమేష్, ఖండాల, ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు