‘అమరావతి ఉచిత వైద్యం’ ఉత్తుత్తికే..

17 Jan, 2018 08:31 IST|Sakshi

రాజధాని నిర్మాణానికి భూములు తీసుకున్నారు

ఆదాయానికి గండి కొట్టారు

వైద్యానికి డబ్బుల్లేక మంచం పడుతున్న అన్నదాతలు

తాడేపల్లి రూరల్‌ :‘కట్టు బట్టలతో అమరావతికి వచ్చా... మీ అందరూ సహకరించండి... మీ పంట పొలాలను రాజధాని నిర్మాణానికి ఇవ్వండి... అన్నీ మీకు ఉచితంగా ఇస్తాం... వ్యవసాయం కన్నా ఎక్కువ లాభాలను చూపిస్తాం... అదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారత్వం... అంటూ ముగ్గురు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి అన్నదాతల దగ్గరనుంచి భూములు సేకరించారు. ఆ తిరిగే సమయంలో ఎవరైనా అనారోగ్యంతో మంచం మీద పడుకుని ఉంటే, ఇక మీ కష్టాలు తీరినాయి, అంతా కార్పొరేట్‌ వైద్యమే, ఎంతైనా ముఖ్యమంత్రి గారు మీకిస్తారని నమ్మబలికారు. తీరా భూములు ఇచ్చిన తర్వాత వారి ఇంటి మొహం కూడా చూడలేదు.

ప్రస్తుతం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారే 10శాతం మంది అన్నదాతలు మంచాన పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ.50వేల కౌలు, రూ.30వేల కౌలు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. వైద్యం ఎలా చేయించుకోవాలో అర్థంకాక మంచానికే పరిమితమయ్యారు. రాజధాని పరిధిలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యమంటూ ‘అమరావతి ఉచిత వైద్య పథకం’ అంటూ ఓ కార్డు అందజేశారు. ఆ కార్డు తీసుకొని కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళితే డబ్బులు కట్టండి, వైద్యం చేస్తాం అంటున్నారు. ఆ కార్డుమీద వైద్యం చేయమని ప్రభుత్వం మాకు ఎటువంటి సందేశాలు పంపించలేదని డాక్టర్లు తెలియచేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే మీ జబ్బుకు సంబంధించిన వైద్యాన్ని మేం చేయగలం కానీ, మందులు మాత్రం బయటనుంచి కొనుగోలు చేయాలని సెలవిస్తున్నారు. అదికూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చెప్పడం లేదు. తమకు ఉన్నది తాకట్టు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 29 గ్రామాలలో రాజధానికి భూములు సేకరించేటప్పుడు సుమారు లక్షా 30వేల మంది జనాభా ఉంటారని అంచనా. ఆ మేరకు 10 రూపాయలతో అమరావతి తొలి పౌరులకు ఉచిత వైద్యం అంటూ పంపిణీ చేసిన కార్డులు నిరుపయోగంగా మారాయి. కానీ కార్డు మీద మాత్రం 1044 రోగాలకు ఉచిత వైద్యం చేస్తున్నట్లు ముద్రించారు. ఏ జబ్బుకు వైద్యం చేయమని అడిగినా మీకు వచ్చిన జబ్బు ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో లేదంటూ వైద్యులు తప్పించుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ కార్డులతో రాజధాని ప్రజలకు ఉపయోగమేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి
ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూములు తీసుకునేటప్పుడు వైద్యం, విద్య ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు. కానీ రాజధాని 29 గ్రామాలలో అది ఎక్కడా అమలు కావడం లేదు. ఇప్పటివరకు వైద్య నిమిత్తం రాజధానిలో అన్నదాతలు, రైతుకూలీలు, సామాన్య ప్రజానీకం వైద్యానికి ఖర్చు పెట్టిన డబ్బును ప్రభుత్వం వెంటనే వెనక్కు ఇవ్వాలి. అప్పుడే అన్నదాతలకు న్యాయం చేసిన వారవుతారు. –ఎమ్మెల్యే ఆర్కే

వైద్యం చేయట్లేదు..
మా తండ్రి నిడమర్రు గ్రామంలో ల్యాండ్‌ ఫూలింగ్‌కు మూడున్నర ఎకరాల పొలాన్ని అందచేశారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఆయనకు వెన్నుపూసలో నొప్పి రావడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. వైద్యం నిమిత్తం ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళితే రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖర్చు భరించలేక ప్రభుత్వాస్పత్రికి వెళితే అటూఇటూ తిప్పారే తప్ప వైద్యం చేయలేదు. మరలా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి రూ.5 లక్షలు వడ్డీకి తెచ్చి వైద్యం చేయించాం. భూములు తీసుకొని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు.           –కొమ్మారెడ్డి కిషోర్, నిడమర్రు

మరిన్ని వార్తలు