పోలవరానికి అడ్డంకులు తొలిగాయి: సీఎం

9 Jan, 2018 01:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్‌/ఏలూరు మెట్రో/అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలో జరగబోయే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందన్నారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఆయన ఎగువ కాఫర్‌ డ్యాం పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి పూర్తి స్థాయిలో క్లియరెన్స్‌ లభించిందని చెప్పారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రాజెక్టు సందర్శనకు వస్తారని చెప్పారు. గోదావరితో పాటు పెన్నా, కృష్ణా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేసి ఐదు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల తొమ్మిది జిల్లాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. 

మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మీదే! 
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సోమవారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధికార మిత్రల గురించి మాట్లాడుతూ.. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమిస్తున్నామని చెప్పారు. వీరు ఆ 35 కుటుంబాల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాల్వ ప్రాజెక్టును మార్చి, ఏప్రిల్‌లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టి మన సంస్కృతిని చాటిచెబుతామన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు అమలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పశ్చిమగోదావరిని ఆదర్శ జిల్లాగా ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలకూ సిమెంట్‌ రోడ్లు వేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు