పోలవరం.. కలవరం

17 Jan, 2018 01:32 IST|Sakshi

ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై అందిన ఫిర్యాదు 

సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదుపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వివరణకు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని  కలవరానికి గురిచేస్తోం ది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఆర్కే గుప్తా రంగంలోకి దిగారు. ఫిర్యాదులోని అంశాలపై  వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఈ నెల 9న రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)కి లేఖ రాశారు. కేంద్రానికి వివరణ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 

పరిహారంలో పక్షపాతం : పోలవరం పనుల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ నెల 3న రాజమ హేంద్రవరానికి చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ జె.చౌదరయ్య పీఎంవోకు లేఖ రాశారు.  2005లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం కుడి కాలువ పనులకు అడ్డుపడుతూ కొందరు రైతులను కోర్టుల్లో కేసులు వేసేలా పురిగొల్పారని.. పట్టిసీమ ఎత్తిపోతలతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలనే నెపంతో 2015లో ఆ కేసులను ఉపసంహరించుకునేలా చేసి ఎకరానికి గరిష్టంగా రూ.52.90 లక్షలు  పరిహారం ఇచ్చారని వివరించారు.

కుడి కాలువలో భూసేకరణ చట్టం–2013 కంటే ఎక్కువ పరిహారం ఇచ్చారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణకు ఎకరానికి రూ.28 లక్షలు ఇస్తామని ప్రభుత్వం అవార్డు జారీ చేసిందని.. సర్కార్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుకు వెళ్లిన వారికి మాత్రం ఎకరానికి కేవలం రూ.17.91 లక్షల పరిహారం ఇచ్చి పక్షపాతం చూపిందని వెల్లడించారు. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమికి ఎకరానికి రూ.10.50 లక్షలు ఇస్తున్నారని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో పరిహారం ఇస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు