అమరావతిలో విధ్వంసకాండ

24 Jan, 2018 14:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న ఏపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు దిగింది. చేతికి వచ్చిన పంటలను నాశనం చేసి అన్నదాతల నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో బుధవారం సీఆర్‌డీఏ అధికారులు దౌర్జన్యాలకు దిగారు. దిగుబడికి వచ్చిన మల్లె తోటలను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నాశనం చేయొద్దని అధికారులను రైతులు వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవాలని అభ్యర్థించినా అధికారులు కనికరించలేదు. చేసేదిలేక అధికారులను నిలదీశారు.

తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పంట పొలాల జోలికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తమ నుంచి భూములు తీసుకునే సమయంలో మల్లె తోటకు ఐదు లక్షలు నష్టపరిహరం ఇస్తామని చెప్పి, కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. మంత్రులు గ్రామాల్లో పర్యటించి పదేపదే భూసేకరణ చేస్తామని బెదిరిస్తే భయపడి రాజధానికి భూములిచ్చామని వెల్లడించారు. తమ దగ్గర నుంచి భూములు తీసుకుని ఇచ్చిన హమీలు అమలు చేయ్యకుండా ప్రభుత్వం మోసం చేసిందని మల్లె తోట రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత తమ తోటల జోలికి రావాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు