ముందే మొదలైన డీజీపీ రేస్‌!

17 Apr, 2018 10:57 IST|Sakshi

పోలీస్‌ బాస్‌ ఎంపికపై  అనేక ఊహాగానాలు

జూన్‌తో ముగియనున్న మాలకొండయ్య పదవీకాలం

ఆనవాయితీ ప్రకారం సురేంద్రబాబుకా? అనురాధకా?

సీనియర్‌ ఐపీఎస్‌లు ఠాకూర్, సవాంగ్‌ల పరిస్థితిపై చర్చ  

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ బాస్‌ ఎంపికకు రేస్‌ ముందే మొదలైంది. డీజీపీ మాలకొండయ్య జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో తదుపరి డీజీపీ ఎవరనేదానిపై పోలీస్‌శాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నండూరి సాంబశివరావుకు రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు గతేడాది చివరివరకూ హడావుడి చేసిన చంద్రబాబు సీనియారిటీ ప్రాతిపదికన మాలకొండయ్యకు డీజీపీ పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డీజీపీగా విధులు చేపట్టిన మాలకొండయ్య జూన్‌లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఇప్పటి నుంచే చంద్రబాబుకు కొందరు సిఫార్సు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అయితే, ముక్కుసూటిగా వ్యవహరించే మాలకొండయ్యను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఇబ్బంది పడతామని చంద్రబాబుకు మరో వర్గం నూరిపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌వీ సురేంద్రబాబును తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. ఆక్టోపస్‌ (కౌంటర్‌ టెర్రరిజం ఫోర్స్‌)లో ఏడీజీగా ఉన్న సురేంద్రబాబుకు ఈ ఏడాది మార్చి 14న డీజీపీగా పదోన్నతి కల్పించారు. అంతేకాక, మార్చి 22న ఆర్టీసీ ఎండీ పగ్గాలు అప్పగించారు. ఇది.. మూడు నెలల తరువాత ఆయనను పోలీస్‌ బాస్‌ చేసేందుకేనన్న ప్రచారం ఆ శాఖలో విస్తృతంగా జరుగుతోంది.

డీజీపీ ఎంపిక ఇక రాష్ట్రం ఇష్టం
గతేడాది చివరలో డీజీపీ ఎంపిక కసరత్తు దశలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెల్సిందే. చివరి నిమిషంలో పంపిన జాబితా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ పలుమార్లు తిప్పి పంపింది. దీంతో పంతానికిపోయిన చంద్రబాబు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా పోలీస్‌ చట్ట సవరణ చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించిన వారే పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దినేష్‌రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య ఆర్టీసీ ఎండీ నుంచి పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వారే. అదే ఆనవాయితీకి కొనసాగింపుగా ఎన్నికల సమయానికి సురేంద్రబాబుకు డీజీపీ పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఐపీఎస్‌లలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఒకవేళ సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన భార్య, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనురాధకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా సురేంద్రబాబు, అనురాధ పేర్లు ఇప్పుడు డీజీపీ రేసులో ముందువరుసలో ఉన్నాయి. కానీ, మాలకొండయ్య తరువాత సీనియర్లుగా ఉన్న వీఎస్‌కే కౌముది, వినయ్‌రంజన్‌ రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్‌ సవాంగ్‌లు ఉన్నారు. కౌముది, వినయ్‌రంజన్‌ రేలు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉండగా.. ఏసీబీ డీజీగా ఠాకూర్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా సవాంగ్‌ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కాగా, సీనియారిటీ కింద డీజీపీ పోస్టుకు ఠాకూర్, సవాంగ్‌లలో ఒకరిని సీఎం ఎంపిక చేస్తారా?  లేక ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు