జీతాలు బ్రేక్‌.. వేధింపుల షాక్‌!

6 Mar, 2019 13:02 IST|Sakshi
సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు (ఫైల్‌)

 కక్ష సాధిస్తున్నారంటున్న మహిళా కార్మికులు

 సమాచారం ఇస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరింపులు 

కుమిలిపోతున్న సచివాలయం మహిళా కార్మికులు   

సాక్షి, సచివాలయం (తుళ్లూరు రూరల్‌) : సభాపతి, రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులు ఉండే సచివాలయంలో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ తాత్కాలిక సచివాలయం ‘సాక్షి’గా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే 170 మంది మహిళా కార్మికులను శుక్రవారం ‘సాక్షి’ పలుకరించింది. వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు.   గతంలో ఎన్నో సార్లు వేతనాల విషయంలో ఆలస్యం చేస్తుంటే, ఇదేంటని ప్రశ్నించిన వారిని సచివాలయం బయట రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాల్లో పనిచేయాలని, లేదా పురుషుల మరుగుదొడ్లను శుభ్రపరచడం లాంటి పనులు కేటాయించడం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
కార్మికులకు బెదిరింపు కాల్స్‌ 
కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కార్మికులకు ఫోన్‌లు చేసి మరీ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధిత మహిళా కార్మికులు వాపోయారు. మూడేళ్లుగా పనిచేస్తున్నా రోజురోజుకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. సమస్యలను కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్దామంటే అందుబాటులో ఉండటం లేదని, అందుబాటులో ఉన్న ఇద్దరు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులు కుమ్మక్కై ఈ విధంగా  వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు.  

కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి 
కార్మికులకు కనీస వేతనాలు చెల్లించని పరిస్థితి సచివాలయంలో నెలకొంది. మూడేళ్లుగా సచివాలయంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నా వారికి నెలకు రూ.6,470 వేతనం చెల్లిస్తున్నారు.  నాలుగు నెలలుగా వేతనం పెంచామని చెప్పి ఒక నెల రూ.6,670 ఇవ్వగా, మూడు నెలలుగా వేతనాలు అసలు ఇవ్వడంలేదని కార్మికులు చెబుతున్నారు. చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి రూ.12,500 వేతనం చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 

సీఆర్‌డీఏ చోద్యం చూస్తోందా?  
కార్మికులు, అందులోనూ మహిళలకు సచివాలయం సాక్షిగా ఇంత అన్యాయం జరుగుతుంటే సీఆర్‌డీఏ అధికారులు ఏమిచేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోగా, అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళా కార్మికులకు ఫోన్‌ చేసి బెదిరించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై పోలీసు కేసు నమోదు చేయాలి. తక్షణమే కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ కార్డులను అందజేయాలి. లేకుంటే కార్మికులతో సచివాలయం ముట్టడిస్తాం. 

  – ఉండవల్లి. శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త 

తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి 
గతంలో కాంట్రాక్టు సంస్థను ప్రశ్నించినందుకు పనిలో నుంచి  తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి గతంలో వేతనంలో నుంచి తీసుకున్న పీఎఫ్‌ను అందించాలి. ప్రతి కార్మికునికి చట్ట ప్రకారం వేతనం చెల్లించాలి. వారాంతపు సెలవులను కేటాయించాలి. 

– మెరుగుమళ్ల రవి, రాజధాని డివిజన్‌ కార్మిక సంఘం  కార్యదర్శి 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 
రాజధానిలో కార్మికులు అంతా దళితులు. రెక్కాడితే గాని  డొక్కాడని పరిస్థితి. అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సచివాలయంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు ఒక్క రోజు మాత్రమే సెలవు దినం. కానీ వేతనం మాత్రం సరిగా ఇవ్వరు. పేదల శ్రమ దోచుకునితింటున్నారు. ప్రతి ఒక్క కార్మికునికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లేకుంటే ఊరుకునేది లేదు. 

– శంగారపాటి సందీప్, అధ్యక్షుడు, ఎస్సీ సెల్‌  
  

Read latest Amaravati News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు