ఇది మాదే... అదీ మాదే!

22 Jan, 2018 08:37 IST|Sakshi

సబ్‌స్టేషన్ల కాంట్రాక్టుకోసం టీడీపీ ప్రజాప్రతినిధి పట్టు

లింగాయపాలెం సబ్‌స్టేషన్‌ టెండర్లకు అడ్డుచక్రం

మిగిలిన 15 సబ్‌స్టేషన్ల టెండర్లపైనా గురి

రాజధానిలో రూ.640కోట్ల టెండర్లకు పన్నాగం

కాంట్రాక్టు మాకే దక్కాలి. లేకపోతే వాటా అయినా ఇవ్వాలి. అంతవరకు టెండర్లు పెండింగే.. ఇదీ సబ్‌స్టేషన్ల కాంట్రాక్టులపై ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అల్టిమేటం. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం, లింగాయపాలెం సబ్‌స్టేషన్‌ టెండర్లు ఖరారు కాకుండా ఆ ప్రజాప్రతినిధి సైంధవపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రూ.40 కోట్ల టెండరుతోపాటు మొత్తం రూ.640 కోట్ల సబ్‌స్టేషన్ల కాంట్రాక్టుపై కన్నేసిన ఆయన ఒత్తిడికి ట్రాన్స్‌కో తలొగ్గుతోంది.

సాక్షి, అమరావతిబ్యూరో: రాజధాని అమరావతిలో 16 సబ్‌స్టేషన్లను దశలవారీగా నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయిం చింది. ఈ మేరకు సీఆర్‌డీఏ కేటాయిం చిన రూ.640కోట్ల బడ్జెట్‌తో ప్రణాళికలు రూపొందించింది. మొదటగా లింగాయపాలెంలో రూ.40 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు బినామీ సంస్థ పేరిట టెండరు వేశారు. ముంబాయి, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపె నీలు కూడా టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్‌ బిడ్‌ను ఆరు నెలల క్రితం తెరి చారు. అయితే ప్రైస్‌బిడ్‌ను ఇంకా తెరవడం లేదు. టెండర్లు ఖరారు చేయడం లేదు. జాప్యం ఎందుకు జరుగుతోందా అని ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి
లింగాయపాలెం సబ్‌స్టేషన్‌ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే ఏకపక్షంగా కేటాయించాలని విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ముంబాయి, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రజాప్రతినిధి సూచించిన సంస్థకు టెండరు వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్ల ప్రక్రియనే పెండింగులో పెట్టేలా చక్రం తిప్పారని సమాచారం. సాంకేతిక కారణాల పేరుతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

వాటా ఇస్తామంటే సరే..లేకుంటే అంతే..
ఒక్క లింగాయపాలెం సబ్‌ స్టేషన్‌ కాంట్రాక్టే కాదు, ఆ తరువాతి  దశల్లో నిర్మించే 15 సబ్‌స్టేషన్ల కాంట్రాక్టుపైనా ఆ ప్రజాప్రతినిధి కన్నేశారు. అంటే రూ.640 కోట్ల కాంట్రాక్టును దక్కించుకోవడమే లక్ష్యంగా చేసుకున్నారు. తాను సూచించిన సంస్థకు టెండరు దక్కాలి, లేకుంటే తనకు వాటా ఇచ్చే సంస్థకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సంస్థలో ప్రస్తుతం కీలకంగా ఉన్న ఉన్నతాధికారి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఆ ఉన్నతాధికారి హైదరాబాద్, ముంబాయిలకు చెందిన సంస్థలతో మంతనాలు సాగిస్తున్నారని సమచారం. లింగాయపాలెం సబ్‌స్టేషన్‌తోపాటు భవిష్యత్‌తో నిర్మించనున్న సబ్‌స్టేషన్ల కాంట్రాక్టుల్లో ఆ ప్రజాప్రతినిధి సంస్థకు వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు సమ్మతిస్తేనే కాంట్రాక్టులు దక్కేలా చేస్తామని ఆఫర్‌ ఇచ్చారని సమాచారం. ఆ విషయంపై స్పష్టత వచ్చేవరకు లింగాయపాలెం సబ్‌స్టేషన్‌ కాంట్రాక్టును పెండింగులోనే ఉంచాలని ఆ ప్రజాప్రతినిధి తేల్చిచెప్పారు. దీంతో ట్రాన్స్‌కో వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడికి లొంగి ఆ టెండరు ప్రక్రియను ప్రస్తుతానికి పక్కనపెట్టేశాయి. అమరావతిలో సబ్‌స్టేషన్ల కాంట్రాక్టు వ్యవహారం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

మరిన్ని వార్తలు