సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

28 Dec, 2017 09:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు నష్ట పరిహారం చెల్లించాలని పెట్రోల్ బాటిల్‌ వెంట బెట్టుకుని ఇబ్రహీంపట్నం-మైలవరం రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు ధర్నాకు దిగారు. తమ ఇళ్లు కూలదోసి నష్ట పరిహారం ఇవ్వకుండా మూడు సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఓ బాధితుడు పెట్రోల్ పోసి తగల బెట్టుకోబోయాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మిగతా వారి దగ్గర పెట్రోల్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తమకు న్యాయం జరిగే వరకు సీఎం ఇంటి దగ్గర నుంచి కదలబోమని బాధితులు భీష్మించుకు కూర్చున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే సమయం ఇవ్వడం లేడని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని ఆరోపించారు. నమ్మించి తమకు వెన్నుపోటు పొడిచారని వాపోయారు.10 రోజుల్లో నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాల నుంచి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

సీఎం ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసులు ధర్నా చేస్తున్న విషయం తెలిసి మంత్రి దేవినేని ఉమ వారికి ఫోన్‌ చేశారు. బాధితులకు తాను సహాయం చేస్తానని వారికి చెప్పారు. తమ మాటలు నమ్మే ఇంతవరకు మోసపోయామని, ఇక మీ మాట నమ్మమన్న భాదితులు చెప్పడంతో ఆయన కంగుతిన్నారు. మీ ఇంటికి న్యాయం చేయమని వస్తే అరెస్ట్ చేయిస్తామన్న మీరు ఇప్పుడు న్యాయం చేస్తామంటే ఎలా నమ్మాలని  భాదితులు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు