సంక్షేమ హాస్టళ్లను వణికిస్తున్న చలిపులి

27 Jan, 2018 04:55 IST|Sakshi
కర్నూల్‌ నగరం బి క్యాంపులో బీసీ హాస్టల్‌లో గదుల కొరతో ఆరుబయటే చలిగాలులతో ఇబ్బంది పడుతూ నిద్రిస్తున్న విద్యార్థ్ధులు

     వసతి గృహాల్లో వసతులు కరువు

     తలుపులు, కిటికీలు లేని భవనాలు

     రాత్రయితే దోమల మోత

     వెంటాడుతున్న నిద్రలేమి, అనారోగ్యం

     చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్న విద్యార్థులు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. చలికాలం వచ్చినా దుప్పట్లు, రగ్గులు, పరుపులు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడం, చాలా హాస్టళ్లకు కిటికీలు, తలుపులు లేకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్రకు దూరమై చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరికొందరు చలికి, దోమలకు తట్టుకోలేక ఇంటి బాట పడుతున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మిన్నకుంటోంది.

శీతాకాలం వచ్చినా..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు 2,020 ఉన్నాయి. వీటిల్లో 1,88,917 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్లలో దాదాపు 500పైగా ప్రైవేటు భవనాలతోపాటు శిథిల భవనాల్లో కొనసాగు తున్నాయి. హాస్టళ్లను తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కనీసం ఉన్న హాస్టళ్ల లోనైనా సదుపా యాలను కల్పించడం లేదు. ఏటా శీతా కాలంలో విద్యార్థులు చలికష్టాలు ఎదుర్కొం టున్నారు. ఇంకా వసతి గృహాల్లో దుప్పట్లు, పరుపులు పంపిణీ చేయలేదు. ఆగస్టులో పంపిణీ చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్కో పరుపుపై ముగ్గురు చొప్పున విద్యార్థులు నిద్రిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక ఇద్దరేసి ఒక దుప్పటితో సరిపెట్టుకుంటున్నారు. కిటీకీలు, తలుపులు లేని హాస్టల్స్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిద్ర పట్టక చలిమంటలతో జాగారం చేస్తున్న సంఘటనలున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమతెరలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. విద్యార్థులు ఇటు చలి, అటు దోమల బెడదతో నిద్రకు దూరమై అనారోగ్యం బారినపడుతున్నారు. స్కూలుకెళ్లినా నిద్రలేమితో చదువుపై శ్రద్ధచూపలేకపోతున్నారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా..
- తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటీకేశ్వరం బీసీ హాస్టల్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. శిథిల భవనంలో వసతి గృహాన్ని నిర్వహిం చలేక స్థానిక హైస్కూల్‌లోనే మూడు గదులను హాస్టల్‌ కింద నిర్వహిస్తున్నారు. అందు లోనూ కిటికీలు, తలు పులు లేక చలితో విద్యార్థులు సతమతమవుతున్నారు. కిర్లంపూడి, అద్దరిపేట, ములకపూడి బీసీ హాస్టల్స్‌ ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉంది. అందులో 85 మంది విద్యార్థులు ఉంటే మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదులు చాలక వరండాలోనే నిద్రిస్తున్నారు. ఈ చలికాలంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇదే జిల్లాలో పెడనలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
కర్నూలులో బి క్యాంపులో ఉన్న బీసీ హాస్టల్‌లో 220 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లను, గోనె సంచులను అడ్డుపెట్టుకుని చలిగాలుల నుంచి రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు చాలక అల్లాడుతున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఆ హాస్టల్‌ జిల్లా ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలోనే ఉంది. అయినా హాస్టల్‌ వైపు తొంగిచూసినవారు లేరు. 

మరిన్ని వార్తలు