ప్రభుత్వ విప్‌గా.. కాపు రామచంద్రారెడ్డి 

13 Jun, 2019 10:02 IST|Sakshi

రాయదుర్గంలో ఆనందోత్సాహాలు 

జిల్లా వ్యాప్తంగా అభిమానుల సంబరాలు 

సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇక జిల్లాలోని వీరశైవులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయకు పట్టం కట్టారని కొనియాడారు. 

నిరుపేదకుటుంబం నుంచీ..
కాపు రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కాపు..కష్టపడి చదువుకున్నారు. రాయదుర్గం మండలం ఆర్‌బీ వంక గ్రామానికి చెందిన భారతిని వివాహమాడారు. కాపు రామచంద్రారెడ్డి తొలుత హాస్టల్‌ వార్డెన్, టీచర్, లైబ్రేరియన్‌గా పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం బళ్లారిలోని ఓఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మేనేజర్‌గా కూడా పనిచేశారు.

రాజకీయ అరంగేట్రం 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ఇష్టపడే కాపు రామచంద్రారెడ్డి...ఆ మహానేత స్ఫూర్తితోనే 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 14,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిచే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి,  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈక్రమంలోనే 2012 జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిపై 32,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాయదుర్గం నియోజకవర్గలోనే చరిత్ర సృష్టించారు. 2014లో స్వల్పఓట్ల తేడాతో పరాజయం చవిచూసినా...నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుపై 14,049 ఓట్ల మెజార్టీతో  విజయ ఢంకా మోగించారు. మూడు సార్లు రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డి తాజాగా బుధవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.

సేవాతత్పరుడు 
కాపు రామచంద్రారెడ్డి సామాజిక బాధ్యతగా తన సొంత నిధులతో సుమారు 8 వేల జంటలకుపైగా ఉచిత వివాహాలు, 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. వందలాది మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. దేవాలయాలకు విరాళాలు, డిగ్రీ  కళాశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, కంప్యూటర్ల వితరణ, కణేకల్లు జూనియర్‌ కళాశాలకు కార్పస్‌ఫండ్‌ ఇచ్చి తనవంతు తోడ్పాటు అందించారు.  

బయోడేటా 

పేరు         : కాపు రామచంద్రారెడ్డి 
తండ్రి పేరు    : కాపు చిన్న తిమ్మప్ప 
తల్లిపేరు       : కాపు గంగమ్మ  
పుట్టిన తేదీ     : 06.10.1963 
అడ్రస్‌          : డోర్‌ నెం: 10–1–33, లక్ష్మీబజార్‌ , 
      రాయదుర్గం , అనంతపురం జిల్లా  
విద్యార్హత    : ఎంకాం (కర్ణాటక యూనివర్సిటీ) 
బీఎల్‌ఐఎస్‌సీ (గుల్బర్గా యూనివర్సిటీ), 
ఎల్‌ఐఎస్‌సీ (గుల్బర్గా యూనివర్సిటీ), 
ఎల్‌ఎల్‌బీ (స్పెషల్‌) ( గుల్బర్గా యూనివర్సిటీ),  భాషా విశారద ఇన్‌ తెలుగు లిటరేచర్‌  
వృత్తి     : న్యాయవాది 
కుటుంబం    : కాపు భారతి (భార్య), 
     ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (కుమారుడు) 
     అలేఖ్య రెడ్డి ( కోడలు), 
     స్రవంతి రెడ్డి (కూతురు), 
     మంజునాథరెడ్డి (అల్లుడు)  

మరిన్ని వార్తలు