బాధ్యతగా పనిచేద్దాం.. జవాబుదారీగా ఉందాం

11 Jun, 2019 18:26 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, పక్కన జేసీ డిల్లీరావు

సాక్షి, అనంతపురం అర్బన్‌: ‘ప్రజాధనంతో వేతనం పొందుతున్నాం... బాధ్యతగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉందాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మెరుగైన సేవలు అందించాలి. వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. నవరత్నాలు అమలు ద్వారా ప్రజాసంక్షేమానికి కృషి చేయాలి’ అని కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావుతో కలిసి జిల్లా అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్‌ పూర్తయిన తరువాత మండల స్థాయి అధికారులు డ్వామా, డీఆర్‌డీఏ అధికా రులు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, ఆశా, ఉపాధ్యాయులు కీలకమన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా పనిచేయాలని సూచించారు. 
చిన్నారుల మరణాలు పునరావృతం కానీయొద్దు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరుగురు చిన్నపిల్లలు చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్‌ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సబ్‌సెంటర్‌ స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ సమన్వయంతో పనిచేసి శిశుమరణాలను నియంత్రించాలన్నారు. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, పూర్తిగా పడేంత వరకు భూగర్భ జల మట్టం పెరగదన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి నివారణ కోసమే ఖర్చు చేయాలన్నారు.

ఉపాధి కూలీలకు పనులు కల్పించండి
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. నీటి కుంటలు, కందకాల నిర్మాణ పనులు కల్పించాలని ఆదేశిం చారు. సంక్షేమ శాఖలకు సంబంధించి రుణాల మంజూరులో ఎల్‌డీఎం కీలక పాత్ర పోషించాలన్నారు. మండల స్థాయిలో జేఎంఎల్‌టీసీ సమావేశాలను ఏర్పాటు చేసి రుణాల మంజూరు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తన వేరుశనగ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేడీఏ హబీబ్‌బాషాను ఆదేశించారు. 

అధికారులకు మెమోలు ఇవ్వండి

‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుడిబండ, వజ్రకరూరు, తనకల్లు, ఆమడగూరు, అమరాపురం, డి.హీరేహాళ్‌ ఎంపీడీఓలు, తహసీల్దార్లు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌కు వస్తుంటే, అధికారులు సమయానికి హాజరుకాకపోతే ఎలాగని ఆగ్రహించారు. గ్రీవెన్స్‌కు హాజరుకాని ఎంపీడీఓలు, తహసీల్దార్లకు మెమోలు జారీ చేయాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌ఓని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు