వైద్యసేవలు మెరుగుపడాలి

12 Jun, 2019 08:03 IST|Sakshi
ప్రభుత్వాసుపత్రిలో వైద్యులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ సత్యనారాయణ తదితరులు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిశు మరణాలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి తనిఖీ నిర్వహించారు.

సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడాలని, కొందరు వైద్యుల వల్లే సమస్యలొస్తున్నాయని, వారు పనితీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. సమన్వయలోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జేసీ–2 సుబ్బరాజుతో కలసి ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూను తనిఖీ చేశారు. యూనిట్‌లో ఉన్న సదుపాయాలు...అందుతున్న సేవలపై వారు ఆరా తీశారు.   
చిన్న సమస్యలు పరిష్కరించుకోరా? 
ఎస్‌ఎన్‌సీయూతో పాటు చాలా వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించగా..సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ అన్నీ పనిచేస్తున్నాయని చెప్పగా..ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా సమాధానమెందుకిస్తారన్నారు. చిన్న సమస్యలను పరిష్కరించుకోకపోతే ఎలాగన్నారు. వార్డులవారీగా సమీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు.   
తీరు మారకపోతే చర్యలు
అనంతరం వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో గత ఐదు నెలల్లో 168 మరణాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైద్యులు కాకమ్మ కథలు చెబుతున్నారని ఎమ్మెల్యే ‘అనంత’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, చిన్న పిల్లల విభాగాధిపతి మల్లీశ్వరి కల్పించుకుంటూ ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి చివరి క్షణంలో కేసులు వస్తున్నాయని చెప్పగా.. చివరి క్షణంలో కేసులు వస్తే రెఫర్‌ చేసిన ఆస్పత్రి వివరాలను కేస్‌ షీటులో ఎందుకు నమోదు చేయలేని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెఫరల్‌ కేసు వివరాలను నమోదు చేయాల్సిందేనన్నారు. ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలపై నిఘా పెంచేలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులే చివరి క్షణంలో కేసులను సర్వజనాస్పత్రికి రెఫర్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో మరణాలు ఏవిధంగా చోటు చేసుకుంటాయని ప్రశ్నించారు. గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలన చేయాలని ఐసీడీఎస్‌ పీడీ చిన్మయాదేవికి సూచించారు.   
శిశుమరణాలపై నివేదిక ఇవ్వండి 
ఆస్పత్రిలోని విభాగాల అధిపతులంతా బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. వైద్యుల మధ్య సమన్వయలోపం ఎందుకు వస్తోందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు మరణాలపై విచారణ చేసి త్వరగా పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్‌కు,  జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ను ఆదేశించారు.  సమావేశంలో అసిస్టెంట్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మ, జిల్లా అంధత్వ నివారణధికారి డాక్టర్‌ కన్నేగంటి భాస్కర్, హెచ్‌ఓడీలు డాక్టర్‌ రామస్వామినాయక్, డాక్టర్‌ నవీన్, డాక్టర్‌ నవీద్‌ అహ్మద్, డాక్టర్‌ ఆత్మారాం  పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు