శ్రీధర్‌ హెల్త్‌కేర్‌ ఆసుపత్రి సీజ్‌

9 Feb, 2018 07:01 IST|Sakshi
ఆస్పత్రిని సీజ్‌ చేస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో) చిత్రంలో ఆస్పత్రి బోర్డు

అనంతపురంలోని హౌసింగ్‌ బోర్డులో శంకర్‌దాదా బాగోతం

అనంతపురం న్యూసిటీ: నగరంలో వర్ష ఆసుపత్రి ఉదంతం మరువక ముందే మరో ఆస్పత్రి అడ్డగోలు బాగోతం గురువారం వైద్య ఆరోగ్యశాఖాధికారి తనిఖీలో వెలుగుచూసింది. స్థానిక హౌసింగ్‌బోర్డు రాంనరేష్‌ ఫంక్షన్‌ హాల్‌లో శ్రీధర్‌ హెల్త్‌కేర్‌ హాస్పిటల్‌లో ఓ వ్యక్తి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ అవతారమెత్తాడు. ఎంబీబీఎస్‌ పట్టా పొందకపోయినా వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. విషయాన్ని ఓ అజ్ఞాతవ్యక్తి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌కి సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందించారు.

దీంతో డీఎంహెచ్‌ఓ తన బృందంతో కలసి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆస్పత్రికి రిజిస్ట్రేషన్‌పై ఆరా తీయగా అలాంటి పేరుతో ఆరోగ్యశాఖలో ఎలాంటి పేరు నమోదు కాలేదనే విషయం వెల్లడయింది. వైద్యుడు కాకుండానే ఎలా చికిత్స చేస్తున్నారని శ్రీధర్‌బాబును డీఎంహెచ్‌ఓ నిలదీయగా మౌనమే సమాధానమైంది. ఏం చదువుకున్నావని ఆరా తీయగా.. ఎం.ఫార్మసీ చేసినట్లు తెలిపాడు. ఇంతలోనే నిర్వాహకుని అత్త జోక్యం చేసుకుని తాను విశ్రాంత వైద్యురాలినని చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆస్పత్రిని సీజ్‌ చేశారు. డీఎంహెచ్‌ఓ వెంట డీఐఓ డాక్టర్‌ పురుషోత్తం, డాక్టర్‌ గంగాధర్‌ రెడ్డి, డెమో ఉపమాతి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు