దివాకర్‌’ అంటే హడల్‌

7 Feb, 2018 08:53 IST|Sakshi
ఆక్సిడెంట్ చిత్రం

నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు నిల్‌

తాజాగా పర్మిట్‌లేని రూట్‌లో నడిపిన బస్సు ప్రమాదం

అయినా పట్టించుకోని రవాణాశాఖ అధికారులు

అనంతపురం సెంట్రల్‌: ప్రజల ప్రాణాలను బలిగొంటున్న దివాకర్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లైసెన్సు లేకపోయినా...పర్మిట్‌ గడువు ముగిసినా ముక్కుపిండి జరిమానా  విధించే అధికారులు దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నా...  చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

17 మంది గాయపడినా...
దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ05డబ్ల్యూ8556 బస్సు సోమవారం బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో వెళ్తూ గుంతల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సుకు పర్మిట్‌ లేకపోవడం... రవాణాశాఖ అధికారులు అడినప్పటికీ డ్రైవర్‌ లైసెన్స్‌ చూపకపోవడం గమనార్హం. వాస్తవానికి మరోదారిలో వెళ్లేందుకు కర్ణాటకలో కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్‌ పొందిన ఈ బస్సును నిబంధనలకు విరుద్ధంగా వేరేదారిలో తిప్పుతున్నారు.

గతేడాది నవంబర్‌ 3న కూడా వ్యవసాయశాఖలో ‘ఆత్మ’ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రమణను కూడా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బలిగొంది. వరుస ప్రమాదాలకు కారణమవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా... దివాకర్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారపార్టీ నాయకులు కావడంతోనే జీ హుజూర్‌ అంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు