కులం అడ్డొచ్చినా.. పెద్దలను ఒప్పించాం

14 Feb, 2018 07:33 IST|Sakshi
డాక్టర్‌ కృష్ణకాంత్‌ రెడ్డి,డాక్టర్‌ ఆర్‌.సింధూ దంపతులు

సందర్భం :  నేడు ప్రేమికుల దినోత్సవం

అక్షరానికి అంతు పట్టనిదే ప్రేమ! దీనికి అర్థం ఎక్కడా దొరకదు. ఒకవేళ అర్థం చేసుకున్నా.. దానిని గుర్తించడం చాలా కష్టం. అటుఇటూ తిరిగి గుర్తించినా.. ఆ భావాన్ని వర్ణించలేరు. ఒకవేళ వర్ణించినా.. దానికి అంతు అంటూ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే అందరిలో ఉండేదే.. అయితే కొందరికి మాత్రమే దక్కుతుంది.  మనసుకు మాటంటూ వస్తే అది పలికే తొలి మాట ఏమిటో తెలుసా? నువ్వంటే ఇష్టమని.... కులమతాలు, పేద ధనిక తారతమ్యాలను అధిగమించి.. ప్రేమను గెలిపించుకున్న వారెందరో జిల్లాలో ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరెందరో. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరి తీపి జ్ఞాపకాలు మీ కోసం..  

డీఎన్‌బీ చేసేందుకు 2010లో హైదరాబాద్‌లోఏని యశోద ఆసుపత్రిలో చేరా. అక్కడ సింధు మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. సబ్జెక్టు విషయంలో ఇద్దరూ చర్చించుకునేవాళ్లం. ఆ సమయంలోనే యూఎస్‌ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనేది తన కల అని చెప్పింది. నాలాగే ఆలోచించే వ్యక్తి తోడు కావడంతో అప్పటికే నేను కూడా విదేశాలకు వెళ్లాలనుకున్న విషయాన్ని ఆమెతో చెప్పా. ఇద్దరం పోటీపడి చదివాం. ఈ క్రమంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. విషయాన్ని మా నాన్న శేషారెడ్డికి చెప్పగా సరేనన్నారు. ఇక సింధు తన తల్లిదండ్రులతో చెప్పగా తమిళియన్స్‌ కాస్త వెనుకంజ వేశారు. సింధు మాత్రం తన నిర్ణయానికే కట్టుబడింది. ఎట్టకేలకు ఇరువైపుల తల్లిదండ్రులను ఒప్పించి 2011లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం ఎండీ పూర్తి చేశాం. నేను న్యూరో ఫిజీషియన్‌గా, తను గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నాం. మా ప్రేమకు ప్రతిరూపమే నాలుగేళ్ల గమ్య. లైఫ్‌ చాలా సంతోషంగా సాగిపోతోంది. ప్రేమకు ఓపిక తప్పనిసరి. ప్రేమ వివాహం చేసుకోవడంతో పాటు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పర్చుకొని గుర్తింపును సొంతం చేసుకోవాలి. ప్రేమలో ఓడిపోయామనే బాధతో ఆత్మహత్యకు పాల్పడటం తగదు. ఉన్నతస్థాయికి చేరుకుని తల్లిదండ్రులను మెప్పించి ప్రేమను గెలుచుకోవాలి.’’
– డాక్టర్‌ కృష్ణకాంత్‌ రెడ్డి,డాక్టర్‌ ఆర్‌.సింధూ దంపతులు

పాతికేళ్ల కిందట కర్నూలు మెడికల్‌ కళాశాలలో మేమిద్దరమూ కలిసి చదువుకున్నాం. అభ్యుదయ భావాలు కలిగిన మా మనసులు కలిసి పెళ్లి చేసుకున్నాం. 1989లో అనంతపురంలో ప్రజా వైద్యశాల ప్రారంభించి, నామమాత్రపు ఫీజులతో రోగులకు సేవలందిస్తూ వస్తున్నాం. ప్రేమించడం అనేది యువత సహజ లక్షణం. అది తప్పు కూడా కాదు. కానీ ప్రేమ పేరుతో ఒకరినొకరు వంచన చేసుకోవడం మంచిది కాదు.  – డాక్టర్‌ గేయానంద్‌   (మాజీ ఎమ్మెల్సీ),డాక్టర్‌ ప్రసూన(మాజీ కార్పొరేటర్‌)

పెద్దలను ఒప్పించి..
ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలంటే పెద్దల అంగీకారం తప్పనిసరి అని భావిస్తాం. 2003లో ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న రోజుల్లో మా మధ్య ప్రేమ చిగురించింది. కులాలు వేరు కావడంతో మా ప్రేమ మా చదువులకు ఇబ్బందిగా మారుతుందని భయపడ్డాం. దీంతో ఇద్దరమూ మా ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలిపాం. రెండు కుటుంబాల్లోనూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. – కోటి సూర్యప్రకాష్‌బాబు(ఎంపీపీ, బత్తలపల్లి),కోటి సుధ ( జెడ్పీటీసీ  మాజీసభ్యురాలు)

పెద్దలను ఒప్పించగలిగాం
మా ఊళ్లో చీమల దొడ్డప్ప అనే పెద్దమనిషి ఉన్నారు. ఆయన మేనకోడలు లావణ్య. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆమె ఇంటర్మీడియట్‌ చదువుకునేందుకు మేనమామ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మా మధ్య పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మా ఇంటిలో పెద్దలు వేరొకరితో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నేను వద్దని చెప్పి, లావణ్య గొప్ప మనసు గురించి ఇంట్లో వాళ్లకి చెప్పి వారిని ఒప్పించాను. కానీ మా పెళ్లికి లావణ్య వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చాలా బాధపడ్డాను. ఒక సంవత్సరం పాటు లావణ్య తల్లిదండ్రులకు మా బంధువుల ద్వారా చెప్పిస్తూ వచ్చాను. ఎట్టకేలకు వారిని ఒప్పించగలిగాను. 2004 ఏప్రిల్‌ 20న మా పెళ్లి జరిగింది. ప్రస్తుతం మాకు ముగ్గురు అమ్మాయిలు. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.
 – కొండా యాదవ్, లావణ్య, కల్లూరు

 వీడి ఉండలేక...
మా సొంత ఊరు బుక్కరాయసముద్రం మండలం జంతులూరు. 2005లో మా మధ్య ప్రేమ మొదలైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవాళ్లం. మా విషయం పెద్దలకు తెలిసి కోప్పడ్డారు. మా పెళ్లికి ఒప్పుకోలేదు. అదే ఏడాది ఇంటి నుంచి బయటపడి పెళ్లి చేసుకున్నాం. హైదరాబాద్‌కు చేరుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో దిగాం. చాలా కష్టపడ్డాం. జీవితంలో నిలదొక్కుకున్నాం. ఆ తర్వాత చాలా రోజులకు మా రెండు కుటుంబాల పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రశాంతంగా జీవిస్తున్నాం. – నాగలింగ, ఆదిలక్ష్మి, హైదరాబాద్‌

ఛాలెంజ్‌గా తీసుకుని..
మాదీ కులాంతర వివాహమే. 2010లో గుంతకల్లు నివాసి రాబియాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మా పెళ్లికి ఇరువైపులా పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఏం చేయాలో మాకు పాలుపోలేదు. ఇద్దరమూ నిరుద్యోగలమే. అయినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి దీంతో పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత మాకు పెద్దల పట్ల మరింత గౌరవ భావం పెరిగింది. బతుకును ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఎలాంటి ఒడిదుడకులు ఎదురైనా విడిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. 2011లో కానిస్టేబుల్‌గా నేను ఎంపికయ్యాను. రాబియా కూడా పట్టుదలతో టీచర్‌గా ఉద్యోగం సాధించుకుంది. మేము జీవితంలో స్థిరపడడంతో మా పెద్దలకు మాపై నమ్మకం కలిగింది. మమ్మల్ని మనసారా ఆశీర్వదించారు.– టి. ప్రేమ్‌కుమార్‌ (కానిస్టేబుల్‌),రాబియా (టీచర్‌)

జీవితంలో గెలవాలి
ప్రేమే జీవితం కాదు. జీవితంలో గెలిచినప్పుడే ప్రేమ కచ్చితంగా దొరుకుతుంది.  చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేక ప్రేమ వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత జీవితాన్ని గెలవలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నమ్మి వచ్చిన భాగస్వామికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంలోనే నిజమైన ప్రేమ ఉంది. రాప్తాడులో మా ఇళ్లు పక్కనే ఉండడంతో కాలేజీకి వెళ్లే సమయంలో ప్రేమలో పడ్డాం. పెద్దలను కాదని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాం.    – దండు మురళి, దివ్య భారతి, రాప్తాడు.

ప్రేమ వివాహంలోనే ఆనందం
కులాల అడ్డుగోడల్ని కూల్చి 22 సంవత్సరాల క్రితం మేము పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి మా ఇద్దరి తల్లిదండ్రులు బాల్య స్నేహితులు. అయినా మా ప్రేమకు ఇరువైపులా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలకు చెప్పకుండా 1995లో ఇంటినుంచి చెక్కేసి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి మాట పట్టింపులు రాలేదు. పెద్దలు చేసిన పెళ్లిళ్లు ఎన్ని సక్రమంగా నిలుస్తున్నాయి? సర్దుబాటు చేసుకుంటేనే వివాహ బంధాలు నిలబడతాయని మా నమ్మకం. ఆందుకే ప్రేమ పెళ్లిలోనే ఆనందం ఉంది.– చిట్రా మనోహరబాబు (లెక్చరర్‌), గాయత్రి, ఆకుతోటపల్లి, అనంతపురం రూరల్‌ మండలం

ఆకర్షణ కాదు.. నమ్మకం
ప్రేమంటే ఆక్షరణ కాదు.. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం. అదే మమ్మల్ని కలిపింది. హిందూపురంలో డిగ్రీ చదువుతున్న సమయంలో మా మధ్య ప్రేమ చిగురించింది. మా పెళ్లికి కులాల పేరుతో పెద్దలు అంగీకరించలేదు. తమ్ముడు, స్నేహితులు సహకరించారు. తర్వాత అనంతపురానికి చేరి ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్లుగా చేరాం. తర్వాత నాకు ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ నచ్చక వదిలేశా. అరుణ ప్రస్తుతం ఉరవకొండలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.  మా పెద్దలు కూడా కలిసిపోయారు. – శ్రీనివాసులు, అరుణ (లెక్చరర్‌), చిలమత్తూరు

బాధ్యతతో కూడుకున్నది...
మా ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలిసిన తర్వాత మొదట్లో కాదన్నారు. అతి కష్టంపై వాళ్లను ఒప్పించి 2008లో పెళ్లి చేసుకున్నాం. ప్రేమ వివాహాలు చాలా బాధ్యతతో కూడుకున్నవి. ఏ సమస్య వచ్చినా స్వయంగా పరిష్కరించుకోవాలి. పెద్దల సహకారం ఉండదు. రక్షణ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు.    – కంచుకుంట శేఖర్‌ (కానిస్టేబుల్‌), మౌనిక, రాప్తాడు

మరిన్ని వార్తలు