అభివృద్ధే అజెండా

12 Jun, 2019 10:07 IST|Sakshi

సార్వత్రిక సమరం ముగిసింది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ప్రజా సమస్యల చర్చలకు వేళయింది.. ఎన్నికల హామీల బరువుతో.. ప్రజాసంక్షేమం.. అభివృద్ధి బాధ్యతతో.. రా రమ్మంటూ అసెంబ్లీ ఆహ్వానిస్తోంది... నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ పోరాడిన మన జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు అధికార పక్ష హోదాలో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమలుకు అసెంబ్లీలో తమ వాణి వినిపించడానికి సిద్ధమవుతున్నారు.

సాక్షి ప్రతినిధి కడప: ఏకపక్ష పాలనకు ఫుల్‌స్టాప్‌ పడింది. అర్హతతో నిమిత్తం లేకుండా పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలకు కాలం చెల్లింది. కొత్త పాలకపక్షం కొలువు తీరింది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం అన్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది. బుధవారం అసెంబ్లీ వేదికగా నూతన ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆపై తొలిసారి అసెంబ్లీలో ప్రజా గొంతుక విన్పంచనుంది.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి నిర్వహించనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలచే ప్రొటెం స్పీకర్‌ చంబంగి అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం గురువారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఆపై ప్రజా సమస్యలపై చర్చలు చేపట్టనున్నారు. కాగా పాలకపక్షంపై జిల్లా వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. 2004–09లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం తరహా అభివృద్ధిని ఆశిస్తున్నారు. నాటి పెండింగ్‌ పథకాలపై సత్వర చర్యలు చేపట్టడంతో పాటు, నవ శకానికి తగ్గట్లుగా వృద్ధి సాధించాలని భావిస్తున్నారు.


ఎన్నికల హామీల అమలుకు ప్రత్యేక శ్రద్ధ.. 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రధానంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, శనగలకు గిట్టుబాటు ధర, గండికోట నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ హామీలిచ్చారు. ఆ మేరకు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపనుంది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌కు దిశా నిర్దేశం చేశారు. డిసెంబర్‌ లోపు స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే అప్పటి టీడీపీ సర్కార్‌ పునాది రాయి మాత్రమే వేసింది. కాగా పునాది రాయితో పాటు అత్యంత వేగంగా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలనే దిశగా వైఎస్సార్‌సీపీ సర్కార్‌ రంగంలోకి దిగనుంది. 2022 నాటికి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే బుడ్డ శనగలు రూ.6500తో కొనుగోలు చేసేందుకు కసరత్తు చేపట్టనున్నారు. ఆమేరకు జిల్లాలో ఉన్న స్టాకు, వాటిని కొనుగోలు చేయాల్సిన ప్రక్రియపై సమీక్ష చేయనున్నారు. గండికోట నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలు చేసే విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల హామీలతో పాటు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేల్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపనున్నారు. ఇప్పటికే తొలి కేబినెట్‌ సమావేశంలో చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తీపి కబురు చెప్పారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేసే దిశగా ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.


అర్థవంత చర్చకు అవకాశం.. 
గత ఐదేళ్లుగా అసెంబ్లీ సమావేశాలంటేనే  ప్రతిపక్షంపై విసుర్లు, పాలకపక్షం బాకా కార్యక్రమంలా ఉండేది. ఉన్నది లేనట్లు...లేనిది ఉన్నట్లుగా ఓ మాయ ప్రపంచాన్ని సృష్టించి, భ్రమలు కల్పించే దిశగా టీడీపీ సర్కార్‌ వ్యవహరించింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ ఇందుకు భిన్నంగా పనిచేయనుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మంత్రి పదవులు కేటాయించే ముందు ఎమ్మెల్యేలకు వివరించి నిర్ణయం తీసుకోవడం, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పథకాలు అమలు చేస్తున్న తీరును విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజకీయాలు, వర్గాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టిన ఉదంతాన్ని సైతం పరిశీలకులు కొనియాడుతుండడం విశేషం. 
  
 

మరిన్ని వార్తలు