ఎల్లిపోతరా?

4 Mar, 2014 01:41 IST|Sakshi
ఎల్లిపోతరా?
  •  ‘దేశం’లో కీలక పదవి కోసం ఎర్రబెల్లి వ్యూహం
  •      దక్కకుంటే పార్టీ మారే యోచన
  •      నిర్ణయంపై వారంలో స్పష్టత
  •      రాజధానిలో శ్రేణులతో భేటీ.. రోజంతా రాజకీయ డ్రామా
  •  సాక్షిప్రతినిధి, వరంగల్ :  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ డ్రామాకు తెరలేపారు. కుదిరితే తెలుగుదేశంలో పట్టు సాధించడం.. లేకుంటే పార్టీ మారడం అనే ద్విముఖ వ్యూహంతో ఆయన పాచిక విసిరారు. సోమవారం ఉదయం నుంచి  ఈ డ్రామా మొదలైంది. పార్టీలో ఉండి కీలకమైన పదవి దక్కించుకోవడమా లేక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని వీడడమా అనేది దీనికి ముగింపుగా ఉండనుందని తెలుస్తోంది.

    ఈ రెండింట్లో ఏదైనా.. వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఎర్రబెల్లి సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టీడీపీకి ఈ ప్రాంతంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అంశం ఇటీవలే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఉన్న తనకే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి దక్కుతుందని ఎర్రబెల్లి ఆశతో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం
    ఈ పదవికి జిల్లాకే చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    ఎర్రబెల్లితోపాటు ఇతర నేతలు.. రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరును వ్యతిరేకిస్తే ఐదుగురు సభ్యులతో పార్టీ తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అరుుతే ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనరుగా ఉన్న తనకు రాష్ట్రం వచ్చాక ఈ స్థాయి పదవి లేకుంటే ఎలా అనే ఆందోళనలో ఎర్రబెల్లి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రాంత పార్టీ శాఖ విషయంలో నిర్ణయం రాకముందే ఈ అంశాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఎర్రబెల్లి ఉన్నట్టు తెలుస్తోంది.

    అనుకున్నట్లు జరిగితే టీడీపీ తెలంగాణ శాఖలో కీలక పదవి వస్తుందని... ఎన్నికలకు అవసరమైన ‘సహకారం’ పార్టీ నుంచి వస్తుందని, ఇవి జరగకపోతే తెలంగాణలో పార్టీ శాఖను ఏర్పాటు చేయనుందుకు నిరసనగా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ఎర్రబెల్లి వర్గీయులు చెబుతున్నారు. ఏది జరిగినా తమ నేతలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని వారు అంటున్నారు. టీడీపీలోని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యతిరేకులు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టీడీపీ అస్పష్ట వైఖరి, తెలంగాణ రాష్ట్ర సమితిపై అతి విమర్శలతో ఇప్పటికే ఇమేజ్ తగ్గిన దయాకర్‌రావు.. దీన్ని అధిగమించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు.   
     
    భేటీ ఎందుకు...
     
    దశాబ్దంన్నరపాటు వర్దన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్‌రావు.. 2009 ఎన్నికలప్పుడు పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం, ఇతర కారణాలతో వర్దన్నపేట తరహాలో పాలకుర్తిలో దయాకర్‌రావుకు పట్టు రాలేదు. ఎన్నికలకు సమీపించిన తరుణంలో టీడీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దయాకర్‌రావు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో హైదరాబాద్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు.

    ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, ముఖ్యకార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పదవి విషయంలో అధినేతపై ఒత్తిడి తేవడంతో పాటు, తన వెంట వచ్చే వారు ఎందరు అనే విషయంలోనూ స్పష్టత కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. సమావేశానికి హాజరైన పలువురు కార్యకర్తలు ‘వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేస్తారా... ఎందుకంటే ఈసారి మీరు వరంగల్ పశ్చిమ లేదా తూర్పు నుంచి పోటీ చేస్తారని బయట ప్రచారం జరుగుతోంది.

    టీడీపీ నుంచే పోటీ చేస్తారా...’ అని ఎర్రబెల్లిని ప్రశ్నించారు. వీటికి దయాకర్‌రావు స్పందిస్తూ ‘కార్యకర్తగా అయినా పార్టీలోనే ఉంటాను. పాలకుర్తి నుంచే పోటీ చేస్తాను’ అని ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నలను ముందుగానే కార్యకర్తలు చెప్పి అడిగించారని సమావేశంలో పాల్గొన్న నేతలే చెబతున్నారు.
     

మరిన్ని వార్తలు