వెలుగుల శాఖపై నిఘా నీడ

4 Jun, 2014 00:51 IST|Sakshi
వెలుగుల శాఖపై నిఘా నీడ

సాక్షి, ఏలూరు : ఏటా విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. అయినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో అవకతవకలను అరికట్టేందుకు ఈపీడీసీఎల్ చర్యలు చేపట్టింది. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల నుంచి విద్యుత్ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై దృష్టి సారించేందుకు  రహస్య తనిఖీ  బృందాలను సంస్థ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు నియమించారు.
 
 మరమ్మతులపై నిఘా
 జిల్లాలో సుమారు 45 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకు కనీసం 100 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుం టాయి. వాటికి మరమ్మతులు చేసే సందర్భంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ఈపీడీసీ ఎల్ సీఎండీ దృష్టికి వెళ్లింది. దీంతో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఇటీవలే ఓ బృందం జిల్లాలో పర్యటించింది. ఇలా తనిఖీ చేయడం వల్ల పొరపాట్లు జరగకుండా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తారని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ అభిప్రాయపడ్డారు.
 
 నిర్మాణాల్లో జాప్యంపై ఆరా
 జిల్లాలో ప్రస్తుతం 196 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వాటిపై లోడ్‌ను తగ్గించేందుకు, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా 27 సబ్‌స్టేషన్లు నిర్మించాలనుకుంటున్నారు. వీటికి సంబంధించి అనుమతులు మంజూరు కాగా, టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో 18 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి జనవరి నుంచి టెండర్లు పిలవలేదు. దీనిపై నిఘా బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. పెనుగొండలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఐదేళ్లుగా నిర్మాణం పూర్తిచేసుకోలేదు. సబ్‌స్టేషన్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటం, టెండర్లు పిలవకపోవడంపై బృందం ఆరాతీసింది. దీనిపై సీఎండీకి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్ల ఇంజినీర్లు, ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్‌ఈ సూర్యప్రకాష్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు