దేవుడి సొమ్ముకు శఠగోపం

9 Feb, 2015 01:43 IST|Sakshi
  • గుళ్లను బాగు చేయమంటే... దేవుడి నిధికే ఎసరు పెట్టారు
  • పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వ వింత వైఖరి
  • ‘పేద ఆలయాల’కు ఉపయోగపడాల్సిన సీజీఎఫ్ నిధులు మళ్లింపు
  • ఉత్సవాల పనులకు ఖజానా నుంచి కేటాయించొద్దని నిర్ణయం
  • తాజా నిర్ణయంతో ధూపదీప నైవేద్యాలకూ కటకట
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి గోదావరి పుష్కరాలు... కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నదీ తీరంలోని దేవాలయాలకు కొత్త శోభ వస్తుందని భక్తులు ఆశించారు. ఇందుకు వీలుగా దేవాదాయ శాఖకు భారీగా నిధులు వస్తాయని భావించారు. కానీ నిధులు ఇవ్వటం దేవుడెరుగు.. శిథిలావస్థలోని ఆలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలకు వాడాల్సిన దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధికే ప్రభుత్వం ఎసరు పెట్టింది. పుష్కరాల పేర నయాపైసా ఇవ్వకుండా ఉన్న నిధులనే ఊడ్చేసింది. అసలే నిధులు సరిపోక దేవాలయాలు కొడిగట్టే దీపంలాగా ఉన్న తరుణంలో... ఉన్న కొద్దిపాటి నిధులనూ మళ్లించి దేవుడి ధూపదీపాలకు ఎసరు పెట్టింది.
     
    ఇదీ కథ...

    వచ్చే జూలైలో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావడంతో వాటిని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.900 కోట్లు వెచ్చించాలని లెక్కలేసింది. ఈ సంఖ్య వినడానికి బాగానే ఉన్నా... అందులో రూ.700 కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రావాల్సినవే. ఆ మేరకు ఢిల్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అవి కచ్చితంగా వస్తాయన్న నమ్మకం ఇప్పటివరకు లేదు. ఇందులో 25 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. ముందైతే దేవాలయాల అభివృద్ధి, సుందరీకరణకు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్టు తొలుత పేర్కొంది. దీంతో ఆయా దేవాలయాల అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేవలం రూ.12 కోట్లనే ప్రకటించారు. పోనీ ఆ రూ.12 కోట్లనైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధి (కామన్‌గుడ్‌ఫండ్) నుంచి వాటిని ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం... ‘పేద గుడుల’కు పెద్ద దిక్కుగా ఉన్న సర్వశ్రేయోనిధికి ఎసరు పెట్టడంతో దేవాదాయ శాఖలో గందరగోళం నెలకొంది.
     
    ఇదీ సమస్య...

    తెలంగాణలో శిథిలావస్థకు చేరుకున్న పలు దేవాలయాల జీర్ణోద్ధరణతోపాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికిప్పుడు రూ.60 కోట్లు కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పనులన్నీ అధికారికంగా మంజూరైనవే. ఇక ధూపదీప నైవేద్యాల కోసం రూ.6 కోట్లు అవసరం. ఈ పథకం కింద నెలకు రూ.2,500 చొప్పున ఇస్తున్న మొత్తాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ఇటీవల ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రకారం మరో రూ.12 కోట్లు అవసరం. ఇక దళిత వాడల్లో ఆలయాల నిర్మాణానికీ ఈ నిధి నుంచే నిధులు కేటాయించాలి. ఇన్ని అవసరాలుండగా ప్రస్తుతం కామన్‌గుడ్‌ఫండ్‌లో ఉన్న నిధులు కేవలం రూ.24 కోట్లే. ఆ నిధులు అసలు అవసరాలకు ఏ మూలకూ చాలనందున ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతున్న తరుణంలో... అందులోంచి రూ.12 కోట్లను పుష్కరాలకు మళ్లించడం గమనార్హం. సర్వశ్రేయోనిధిని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు ఉండటంతో... పుష్కరాలు కూడా ధార్మిక కార్యక్రమాలే అని పేర్కొంటూ వాటిని మళ్లిస్తోంది.
     
    బడ్జెట్‌లో రూ.300 కోట్లు పెడతాం..

    దీనిపై దేవాదాయ శాఖ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆ శాఖ మంత్రి కొత్త హామీతో వారిని తృప్తి పరిచే ప్రయత్నం చేశారు. వచ్చే బడ్జెట్‌లో దేవాదాయ శాఖకు రూ.300 కోట్లు ప్రకటించనున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు