ప్రభుత్వాదేశాల మేరకే ఇస్తున్నాం

29 Mar, 2016 00:44 IST|Sakshi

ప్రభుత్వాదేశాల మేరకే 10లక్షల్లోపు నీరు-చెట్టు పనులను నీటి సంఘాలకు, జన్మభూమి కమిటీలకు అప్పగిస్తున్నాం. త్వరలోనే వర్కు ఆర్డర్స్ జారీ చేస్తాం. గత ఏడాది పనుల కేటాయింపులో జరిగిన జాప్యం వల్ల ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. కానీ ఈసారి వేసవి ముందే పనులు అప్పగిస్తున్నందున వర్షకాలం మొదలయ్యేలోగానే పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది.

-నాగేశ్వరరావు, ఎస్‌ఈ, ఇరిగేషన్ శాఖ, విశాఖ


పచ్చనేతలకు ‘కోట్లు’ ఫలహారం నామినేషన్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు నీటి సంఘాలు.. జన్మభూమి కమిటీలకు అప్పగించేందుకు సిద్ధం గత ఏడాది మట్టినీ అమ్ముకున్న అధికార పార్టీ నేతలు నామినేషన్ల జాఢ్యం ఇరిగేషన్‌కు శాఖకు పాకింది. ఇప్పటి వరకు ఈ శాఖలో పనులన్నింటినీ టెండర్ల పద్ధతిలోనే కేటాయించేవారు. రూ.5 లక్షల లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించే వారు. కానీ ఈ ఏడాది ‘నీరు-చెట్టు’ పనులకు నామినేషన్ పరిమితిని ఏకంగా రూ. 10 లక్షలకు పెంచేసి  పచ్చచొక్కాల పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపిక పేరుతో దొడ్డిదారిన నీటి సంఘాల్లోతిష్టవేసిన టీడీపీ నేతలకు ఈ పనులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. సంఘాల్లేని చోట జన్మభూమి కమిటీలకు ధారాదత్తం చేయనున్నారు.



విశాఖపట్నం:  జిల్లాలో గత ఏడాది నీరు-చెట్టు పథకం కింద నీటిపారుదల శాఖ పరిధిలో రూ.61.75 కోట్లతో 448 పనులు చేపట్టారు. జిల్లాలో వందెకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 236 ఉంటే.. రూ.23.27 కోట్లతో రెండు విడతల్లో 92 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. వీటిలో ఐదు చెరువుల  పనులు మాత్రమే నూరు శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని ఈ ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది నామినేషన్ పరిమితిని రూ.10లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం 216 చెరువుల్లో పూడికతీత పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. వీటిలో కొన్ని చెరువుల్లో పూడికతీతకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనా. అలా అయితే నామినేషన్ పద్ధతి పని చే య దు. అందుకే అటువంటి పనులను రూ. 10 లక్షల లో పు ప్యాకేజీలుగా విడగొట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.17 కోట్ల విలువైన ఈ పనులను నీటి సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. సంఘాల్లేని చోట జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 150 చెరువులను నీటి సంఘాలకు, 66 చెరువులను జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ ఒకటి రెండ్రోజుల్లో వర్కు ఆర్డర్స్ ఇవ్వనున్నారు.

 
మట్టినీ సొమ్ము చేసుకున్నారు: గత ఏడాది ఐదు చెరువుల్లోనే నూరుశాతం పూడికతీత జరగ్గా.. మిగిలిన చెరువుల్లో 10 నుంచి 70 శాతం వరకు పనులు జరిగాయి. ఈ విధంగా వెలికితీసిన 16.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని పచ్చనేతలు ఎంచెక్కా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ మట్టిని పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, శ్మశానాలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రైతు పొలం గట్లు ఎత్తు చేసేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో తవ్వి తీసిన మట్టిలో 80 శాతం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ విధంగా రూ.10 కోట్ల వరకు వారి జేబుల్లోకి వెళ్లినట్టు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ ఏడాది ఇంకా వేసవి ప్రారంభం కాకముందే 216 చెరువులను నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంతో వీటిలో మట్టిని కూడా దర్జాగా అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటి నుంచే టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

మరిన్ని వార్తలు