బియ్యానికి భరోసా

3 Sep, 2013 02:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే రేషన్ సరకులకు ఇబ్బందులు తప్పాయి. ఉధృతంగా కొనసాగుతున్న సమైక్య సమ్మె వల్ల సెప్టెంబరు కోటా సరకుల పంపిణీకి ఇబ్బందులు తప్పవని భావించినా చివరకు ఆటంకాలు తొలగాయి. తొలుత రేషన్ డీలర్ల నుంచి సమ్మె సెగ తగులుతుందనే భయంతో అధికారులు కంగారుపడ్డారు. కానీ సరకుల పంపిణీకి సహకరించడానికి ముందుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో సమ్మె మరింత ఉధృతం అయ్యేలోగా జిల్లాలో ఎక్కడికక్కడ బియ్యం పంపిణీ పూర్తి చేయించడానికి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అమ్మహస్తం సంచులను కార్డుదారులకు అందించనున్నారు. జిల్లాకు ప్రతి నెలా తెల్ల బియ్యం కోటా కింద 1500 టన్నుల బియ్యం అవసరం. నెల రోజులకుపైగా జరుగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల బియ్యం కోటా ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. చాలామంది కార్డుదారులు సైతం సరకులు విడిపించుకోలేదు. ఈ నేపథ్యంలో చాలావరకు సరకు మిగిలిపోయింది. దీనికి తోడు సెప్టెంబరు కోటా బియ్యం తొలి విడతగా విడుదలైన బియ్యంతో ప్రసుత్తం పలు గోడౌన్లలో 750 టన్నుల బియ్యం నిల్వలున్నాయి.

మిగిలిన సరకు చేతికి వచ్చేలోపు వీటిని కార్డుదారులకు సరఫరాచేయాలని అధికారులు నిర్ణయించారు. సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపించడంతో రెండురోజుల నుంచి అధికారులు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కట్టించుకోవడం మొదలుపెట్టారు. మరో రెండు రోజుల్లో మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం వాహనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కొన్నిచోట్ల బియ్యం తరలించే వాహనాలను ఆందోళనకారులు అడ్డగిస్తుండడంతో సరకు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటికే పలుజిల్లాలో ఇటువంటి పరిస్థితులు సంభవించడంతో జిల్లాలో ఆ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాలను అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే వాహనాలకు కొంతవరకు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నారు.

మరోపక్క జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పౌరసరఫరాశాఖ అధికారులు ఎక్కడికక్కడ మండలాలకు బియ్యం సకాలంలో చేరేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు తెల్ల బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత అమ్మ హస్తం సంచులు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల కార్డుల ప్రకారం జిల్లాకు 10.84 లక్షల సంచులు అవసరం. వీటిలో మొత్తం అన్నీ ఒకేసారి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అందులో సగమైనా జిల్లాకు రప్పించి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు