కోడి పందేల నిర్వాహకులపై 1,347 కేసులు

17 Jan, 2017 01:24 IST|Sakshi
కోడి పందేల నిర్వాహకులపై 1,347 కేసులు

మీడియా సమావేశంలో డీజీపీ సాంబశివరావు వెల్లడి

సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా 1,347 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 337,  తూర్పుగోదావరి జిల్లాలో 136, కృష్ణా జిల్లాలో 471, విజయవాడ సిటీలో 91, గుంటూరు అర్బన్లో 3, గుంటూరు రూరల్‌లో 309 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన గుడివాడ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

విజయవాడలో దుండగులు ధ్వంసం చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అదే స్థానంలో పెట్టిస్తామన్నారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిని సీసీ కెమెరా ఫుటేజ్‌ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై  ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని డీజీపీ చెప్పారు. కైకలూరు మండలం ఆటపాక, కలిదిండి మండలం తాళ్లాయి పాలెంలో కొందరు ఫ్లెక్సీలు చించి వివాదం సృష్టించే ప్రయత్నాలు చేశారని డీజీపీ అన్నారు. పథకం ప్రకారం కొన్ని అసాంఘిక శక్తులు కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నాయకుల విగ్రహాలు, సినిమా హీరోల ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్నట్టు గుర్తించామని డీజీపీ చెప్పారు.

మరిన్ని వార్తలు