ఖాతాలు ఖతం

2 Nov, 2014 03:12 IST|Sakshi
ఖాతాలు ఖతం

రైతన్నల జీవితాలతో ప్రకృతే కాదు ... పాలకులూ ఆడుకుంటున్నారు. అధికార దాహంతో అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా పాలన సాగిస్తుండడంతో అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. రుణం కట్టాలంటూ బ్యాంకర్లు ... ఆధార్, రేషన్ కార్డుల పేరుతో తొలగింపులకు పాల్పడుతుండడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
* 1.50 లక్షల ఖాతాల తిరస్కరణ?  
* జన్మభూమి కమిటీలో తుది నిర్ణయం
* మళ్లీ రైతుల్లో టెన్షన్
 ఒంగోలు: రైతుల్లో మళ్ళీ టెన్షన్ ప్రారంభమైంది. రుణమాఫీకి సంబంధించి తాజాగా జిల్లాలో 1.50 లక్షల ఖాతాలు తిరస్కరణకు గురైనట్లు సమాచారం.  జన్మభూమి మండల కమిటీకి పంపి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కమిటీలు మళ్లీ వాటిని గ్రామసభలకు పంపి వారు ఇచ్చే నివేదికపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడంతో రైతుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. రుణమాఫీకి సంబంధించి అక్టోబరు 19వ తేదీనాటికి బ్యాంకర్లు తాము సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలో ప్రభుత్వం సూచించిన ఏపీ స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఏపీఎస్‌ఆర్‌డీహెచ్)లో అప్‌లోడ్ చేశారు. ఆధార్ కార్డును జతపరచకపోవడంతో ప్రాథమికంగా 15631 ఖాతాలను ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ ప్రాథమిక దశలోనే తొలగించింది.

అవిపోను మిగిలిన మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 6,81,276 . కానీ తరువాత మరికొద్ది రోజులు గడువు ఇవ్వడంతో 19019మంది తమ ఆధార్, రేషన్ కార్డులను జతచేశారు. దీంతో మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది. రుణమాఫీకి సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డును కూడా పొందుపరిచారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే రుణం వర్తిస్తుందంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆధార్ నెంబర్, రేషన్‌కార్డులోని సభ్యుల వివరాలను పోల్చుకోవడం ద్వారా కొంతమందిని రుణమాఫీని తొలగించాలనేది ప్రభుత్వం లక్ష్యం.

తాజాగా మరికొన్ని రోజులు అవకాశం కల్పించడంతో తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఏపీస్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ పరిశీలించిన వాటిలో బ్యాంకర్లు పంపే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిచేసి తిరిగి పంపాలంటూ ఇప్పటికే బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో పరిశీలిస్తే కొండెపి, తర్లుపాడు, ఉప్పలపాడు, వలేటివారిపాలెం, కొమరోలుతోపాటు పీడీసీసీబీకి చెందిన ఎనిమిది ఖాతాలు కూడా రూ10 లక్షలపైన రుణాలు తీసుకున్నట్లు ఏపీఎస్‌ఆర్‌డీహెచ్‌కు పంపించారు. అయితే వాస్తవానికి వారు అంత మొత్తం రుణం తీసుకొని ఉండరనేది ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ భావన. దీంతో పొరపాటు జరిగి ఉంటుందని భావించి వాటిని పరిశీలించి పంపాలంటూ ఆదేశించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు