1న కేయూ ద్వితీయ స్నాతకోత్సవం

22 Jul, 2014 02:02 IST|Sakshi
1న కేయూ ద్వితీయ స్నాతకోత్సవం
  •  గవర్నర్ నరసింహన్ రాక
  •   వీసీ వెంకయ్య
  • మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలను  1వ తేదీన నిర్వహించనున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలోని ఆయన చాంబర్‌లో విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 4గంటలకు  ద్వితీయ స్నాతకోత్సవం ప్రారంభమవుతుందన్నారు.  

    స్నాతకోత్సవ వేడుకలకు కృష్ణా యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ సీఎస్‌ఎల్.నరసింహన్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు పాల్గొంటారన్నారు. స్నాతకోత్సవంలో మొత్తం 16,562 మంది పట్టభద్రులకు సర్టిఫికెట్లు ఇస్తారన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2,276 మంది, గ్రాడ్యుయేషన్‌లో 14,286 మందికి పట్టాలు అందిస్తామన్నారు.

    ఈ స్నాతకోత్సవంలో ముగ్గురికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. గూడపాటి మంగరాజు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను కొల్లూరి కల్పనకు, కోటేశ్వరరావు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను మల్లాది దీప్తికి, సంజిత్‌నాధ్ అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను బండి సుస్మితకు అందజేస్తారని చెప్పారు.
     
    పది వారాల్లో భవన నిర్మాణ పనులు...
     
    మరో పది వారాల్లో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలు పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య అన్నారు.  రూ. 70 కోట్లతో ప్రాథమిక ప్రతిపాదనలు  సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ భవనాలు నిర్మించే ప్రాంగణంలో నీటి సౌకర్యం కోసం రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల చెరువును ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించామన్నారు. త్వరలో  మచిలీపట్నంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వీసీ తెలిపారు.  కృష్ణా యూనవర్సిటీ రిజిష్ట్రార్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు